Houthi attack: యెమెన్‌పై హూతీల దాడి.. 30 మంది సైనికుల మృతి,50 మందికిపైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని యెమెన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు వెల్లడించారు. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతో వారు తమ పేర్లు వెల్లడించకుండా వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి చెందిన బలగాలు మోహరించిన మారిబ్, హద్రామౌత్ ప్రావిన్సుల్లోని సైనిక శిబిరాలపై హౌతీలు ఒకేసారి దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ప్రభుత్వ బలగాలకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
వివరాలు
దాడులపై స్పందించని హౌతీ తిరుగుబాటుదారులు
2022 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన అనధికారిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన దాడిగా దీనిని అధికారులు అభివర్ణిస్తున్నారు.
ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు,సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి మద్దతు పొందుతున్న యెమెన్ ప్రభుత్వ బలగాల మధ్య ప్రధాన యుద్ధ చర్యలు అప్పటి నుంచి గణనీయంగా తగ్గాయి.
యెమెన్ సైన్యం కూడా హౌతీలు తమ శిబిరాలపై దాడులు జరిపిన విషయాన్ని ధృవీకరించింది.
ఈ దాడుల్లో పలువురు సైనికులు మృతి చెందారని,మరికొందరు గాయపడినట్లు వెల్లడించినప్పటికీ, ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించలేదు.
మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులపై వెంటనే స్పందించలేదు.
వివరాలు
2014లో యెమెన్ రాజధాని సనా నగరాన్ని స్వాధీనం చేసుకున్న హౌతీ
అయితే తాము చేపట్టిన "భారీ సైనిక ఆపరేషన్"కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని మాత్రమే తెలిపారు.
ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.
2014లో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది.
దీంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం సౌదీ అరేబియాకు వెళ్లాల్సి వచ్చింది.
అనంతరం 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో హౌతీలపై యుద్ధం ప్రారంభించింది.
అయితే సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పోరు ప్రతిష్ఠంభనగా మారింది. ఇరు పక్షాలు స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోవడంతో యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది.