Loading...
Houthis: ఎర్రసముద్రంలో మరో దాడి.. చమురు ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం
ఎర్రసముద్రంలో మరో దాడి.. చమురు ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం

Houthis: ఎర్రసముద్రంలో మరో దాడి.. చమురు ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. సౌదీ అరేబియా నైరుతి తీరంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్‌తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO)ధ్రువీకరించింది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని అల్ షుకైక్ ప్రాంతానికి నైరుతి దిశలో సుమారు 70 నాటికల్ మైళ్లు (దాదాపు 130 కిలోమీటర్లు) దూరంలో చోటుచేసుకుంది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సముద్ర పర్యావరణానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. ఘటన అనంతరం నౌక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

వివరాలు 

హెచ్చరికల అనంతరమే ఈ దాడి

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని తామే ఈ సైనిక దాడులు నిర్వహించినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ అధికారికంగా ప్రకటించారు.

తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై సౌదీ ప్రభుత్వం దిగ్బంధం కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, సౌదీకి చెందిన నౌకలపై సముద్ర నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే హౌతీలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఆ హెచ్చరికల అనంతరమే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రపంచ సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరగడంతో పశ్చిమాసియాలో సముద్ర భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం

మరోవైపు, ప్రముఖ నౌకాయాన విశ్లేషణ సంస్థ క్లెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం,భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్ననేపథ్యంలో హర్మూజ్ జలసంధి,బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మార్గాల ద్వారా జరిగే నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి.

హౌతీల హెచ్చరికల ప్రభావంతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ పరిసరాల్లో ప్రయాణిస్తున్న అనేక వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి వెనుదిరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కీలక సముద్ర మార్గాల్లో వరుసగా జరుగుతున్నదాడులు ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫలితంగా గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో పాటు సరుకు రవాణా ఛార్జీలు (ఫ్రైట్ చార్జీలు)భారీగా పెరిగే ప్రమాదం ఉందని,దాని ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT