Loading...
Netanyahu: భారత్‌లో పుట్టిన ఫేక్‌ న్యూస్‌తో తప్పుడు ప్రచారం.. ఇజ్రాయెల్‌, అమెరికాకు ఎలా చేరిందంటే?
ఇజ్రాయెల్‌, అమెరికాకు ఎలా చేరిందంటే?

Netanyahu: భారత్‌లో పుట్టిన ఫేక్‌ న్యూస్‌తో తప్పుడు ప్రచారం.. ఇజ్రాయెల్‌, అమెరికాకు ఎలా చేరిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో మొదలైన ఓ తప్పుడు సోషల్‌ మీడియా పోస్టు గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌, అమెరికాకు చేరింది. చివరకు ఆ సమాచారమే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చింది. ఇరాన్‌ అణు కార్యక్రమానికి సంబంధించి నెతన్యాహు చేసిన కీలక వ్యాఖ్యకు ఆధారమైన సమాచారం నకిలీదని తాజాగా వెల్లడైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని ఐక్యరాజ్యసమితి రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ కూడా అదే పోస్టును షేర్‌ చేయడం ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది.

వివరాలు 

ఈ తప్పుడు ప్రచారానికి భారత్‌కు చెందిన ఓ ఎక్స్‌ ఖాతా శ్రీకారం

ఆగస్టు 5న భారత్‌కు చెందిన ఓ ఎక్స్‌ ఖాతా ఈ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ అహ్మద్‌ వహీది..అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ నిలిపివేయబోమని చెప్పినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.

దీనికి వహీది ఫొటోతో పాటు అణు విస్ఫోటనాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.

అయితే వహీది అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేసిందన్న విషయానికీ ఆధారాలు లేవని వెల్లడైంది.

మొదట ఈ పోస్టు భారత్‌లోనే మరో ఎక్స్‌ ఖాతాకు చేరింది. అక్కడి నుంచి దానిని హిందీలోకి అనువదించారు.

అనంతరం 'మొసాద్‌ కామెంటరీ' పేరుతో ఉన్న ఇజ్రాయెల్‌ ఖాతా ఈ సమాచారాన్ని మరింతగా ప్రచారం చేసింది.

వివరాలు 

ఆ పోస్టును షేర్‌ చేసిన నెతన్యాహు కుమారుడు

అయితే ఆ ఖాతాకు ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌తో సంబంధం ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్‌ 14 ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసింది.

నెతన్యాహు కుమారుడు యైర్‌ నెతన్యాహు కూడా ఆ పోస్టును షేర్‌ చేశారు.

ఈ విధంగా తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించి కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రసంగంలోకి చేరింది.

జెరూసలెంలోని మౌంట్‌ హెర్జల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నెతన్యాహు ఇరాన్‌ అణ్వాయుధాల అంశంపై మాట్లాడుతున్న సమయంలో ఈ సమాచారాన్ని సంకేతంగా ప్రస్తావించారు.

మరోవైపు అమెరికా రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ కూడా ఇరాన్‌ తన అణు ఉద్దేశాలను అంగీకరించిందంటూ పోస్టు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ ప్రచారాన్ని ఖండించిన ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి

అయితే ఆ తర్వాత ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఆ పోస్టును తొలగించారు.

వైరల్‌గా మారిన ఈ ప్రచారాన్ని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ ఖండించారు.

ఇరాన్‌పై కొనసాగుతున్న తప్పుడు ప్రచారానికి ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

ఒక సోషల్‌ మీడియా ఖాతాలో మొదలైన నిరాధార సమాచారం ఎలా గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ స్థాయికి చేరగలదో ఈ ఘటన స్పష్టం చేసింది.

అంతేకాకుండా నిజానిజాలను నిర్ధారించకముందే అలాంటి సమాచారం రాజకీయ చర్చలోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ADVERTISEMENT