Chongqing rail station: రోబోలతో రికార్డు.. 38 నెలల్లోనే భారీ హైస్పీడ్ రైల్వే స్టేషన్ నిర్మించిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే భారీ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేయడంలో చైనా మరోసారి తన సత్తా చాటింది. సముద్రాలపై కిలోమీటర్ల మేర వంతెనలు,ఎత్తైన పర్వతాల మధ్య భారీ వారధులు నిర్మించిన చైనా.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన చాంగ్‌కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే హబ్‌ను కేవలం 38 నెలల్లో నిర్మించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నిర్మాణంలో పెద్దఎత్తున రోబోలను వినియోగించడం విశేషంగా నిలిచింది. చాంగ్‌కింగ్‌లోని నాన్స్ జిల్లాలో 2022 మేలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం 2025 జూన్‌లో స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ అద్భుత నిర్మాణానికి సంబంధించిన ఆరు నిమిషాల వీడియోను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన ఎక్స్ వేదికలో పంచుకున్నారు.
వివరాలు
12.2లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే హబ్
"భవిష్యత్తుకు స్వాగతం.. ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైల్వే వ్యవస్థను ఇప్పుడు చైనా నిర్వహిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ వీడియోను ఇప్పటికే ఐదు కోట్ల మందికిపైగా వీక్షించారు. పలువురు ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే దృశ్యాల్లా ఉందంటూ స్పందించారు.
ఈ రైల్వే హబ్ మొత్తం 12.2లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది.
హైస్పీడ్ రైళ్లతో పాటు మెట్రో సేవలు,బస్సులు,ట్యాక్సీలు, సుదూర రవాణా సౌకర్యాలను ఒకే చోట కలిపే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంది.
ఇందులో 15 ప్లాట్‌ఫాంలు, 29 రైల్వే పట్టాలు ఏర్పాటు చేశారు. గంటకు సుమారు 16 వేల మందికి సేవలందించే సామర్థ్యం దీనికి ఉంది.
ఏడాదికి దాదాపు 10 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించారు.
వివరాలు
అత్యాధునిక రోబో సాంకేతికతను రంగంలోకి దించిన చైనా
ఉక్కు, గాజుతో రూపొందించిన ప్రత్యేక నిర్మాణ శైలివల్ల స్టేషన్‌లో సహజ కాంతి సమృద్ధిగా అందేలా తీర్చిదిద్దారు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం అంత సులభం కాదు. క్లిష్ట భౌగోళిక పరిస్థితులతో పాటు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన తీవ్రమైన ఎండల్లో పనులు చేపట్టాల్సి వచ్చింది.
దీంతో చైనా అత్యాధునిక రోబో సాంకేతికతను రంగంలోకి దించింది.
లేజర్ మార్గదర్శక వ్యవస్థతో పనిచేసే నాలుగు చక్రాల రోబోలను వినియోగించి కాంక్రీట్ ఉపరితలాన్ని సమతలంగా రూపొందించారు.
లైడార్, కృత్రిమ మేధస్సు, ఐదో తరం సమాచార సాంకేతికత సహాయంతో మిల్లీమీటరు స్థాయిలో ఖచ్చితత్వాన్ని సాధించారు.
ఈ రోబోలు సాధారణ కార్మికుల కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడమే కాకుండా, నిర్మాణ వ్యయాన్ని 40 శాతం వరకు తగ్గించాయి.
వివరాలు
గాజు పలకలను అమర్చడంలో రోబోల వినియోగం
అలాగే 800 కిలోల బరువున్న గాజు పలకలను అమర్చడంలో కూడా రోబోలను వినియోగించారు.
దీంతో ప్రమాద అవకాశాలు 90 శాతం వరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
బహుముఖ దిశల్లో పనిచేసే వెల్డింగ్ రోబోలు, 24 గంటల పర్యవేక్షణ నిర్వహించే రోబోలు నిర్మాణ పనుల వేగాన్ని మరింత పెంచాయి.
ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే నిర్మాణ రంగంలో ఎంత పెద్ద మార్పు సాధ్యమో చైనా మరోసారి ప్రపంచానికి చూపించింది.