గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది. అదే సమయంలో పశ్చిమాసియాలో సైనిక పరంగా అత్యంత శక్తిమంతమైన ఇజ్రాయెల్‌పై దాడి చేసేంత ఆయుధ సంపత్తి హమాస్‌కు ఎక్కడిదనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. గాజా స్ట్రిప్ ప్రాంతం టెక్నికల్‌గా పాలస్తీనా దేశమైనా, దానిపై పెత్తనం అంతా ఇజ్రాయెల్‌దే. అక్కడి గాలి, నీరు, రవాణా అంతా ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటుంది. అలాంటి గాజాలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఆయుధాలను ఎలా పొందగలిగారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి.. హమాస్ మిలిటెంట్లు భారీగా ఆయుధాలను, రాకెట్లను ఎలా కూడబెట్టారు అనే దానిపై చర్చ జరుగుతోంది.
సొరంగాలను మార్గంగా చేసుకొని..
గాజా స్ట్రిప్ ప్రాంతం ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. పశ్చిమ తీరం మధ్యధరా సముద్రం ఉంటుంది. అరబ్ యుద్ధంలో పాలస్తీనాకు చెందిన గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005కి గాజాను తిరిగి పాలస్తీనాకు అప్పగించింది. కానీ గాజా సరిహద్దులను ఇప్పటికీ ఇజ్రాయెల్‌లే నియంత్రిస్తుంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం కళ్లు గప్పి, హమాస్ గ్రూప్ ఆయుధాలను సేకరిస్తోంది. ఆయుధ స్మగ్లర్లు మధ్యధరా సముద్రం ఒడ్డున ఆయుధాలను పడవేస్తారు. ఆ తర్వాత ఆ ఆయుధాలను తమ నెట్‌వర్క్ ద్వారా హమాస్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుంటారు. ఆయుధాల స్మగ్లర్లు ఆయుధాలను సరఫరా చేసేందుకు సొరంగాలను మార్గంగా ఉపయోగించినట్లు సమాచారం.
ఇరాన్, సిరియా నుంచి అధునాతన ఆయుధాల సరఫరా
గాజా ప్రాంతం ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతానికి ఆయుధాలను అందించడానికి హమాస్ మిలిటెంట్లు ప్రత్యేకంగా సొరంగాల నిర్మించారు. ఫజ్ర్-3, ఫజ్ర్-3, ఎమ్-302 వంటి అత్యాధునిక రాకెట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రని సొరంగాల ద్వారా హమాస్‌కు ఇరాన్, సిరియాకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆయుధాలను హమాస్ కొన్నేళ్లుగా సేకరిస్తున్నట్లు సమాచారం. రాకెట్ సాంకేతికతను కూడా ఇరాన్ సాయంతో హమాస్ సొంతంగా అభివృద్ధి చేసుకుంది. ఇరాన్ అందించిన అధునాతన ఆయుధాలతో ఇజ్రాయెల్ అభేద్యమైన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను హమాస్ అధిగమించిందనే చెప్పాలి. హమాస్‌కు ఇరాన్ భారీగా ఆయుధాలను చేరవేస్తోందని, శిక్షణ ఇస్తోందని 2021లో అమెరికా చెప్పింది. హమాస్‌కు అందుతున్న మొత్తం నిధులలో 70 శాతం ఇరాన్ నుంచే వస్తున్నట్లు పేర్కొంది.
హమాస్ మిలిటెంట్లకు తాలిబన్లకు లింకేంటి?
ఇదిలా ఉంటే, హమాస్ మిలిటెంట్లు వినియోగిస్తున్న ఆయుధాల్లో ఆమెరికా తయారు చేసినవి ఉండటం గమనార్హం. అమెరికా ఆయుధాలు హమాస్ గ్రూప్ వద్ద ఎలా ఉన్నాయి అని ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత అమెరికా దళాలు తిరిగి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో మిలియన్ల డాలర్లు విలువ చేసే యుద్ధ సామగ్రి, రాకెట్లు, అధునాతన ఆయుధాలను అమెరికా అక్కడే వదిలేసి పోయింది. అమెరికా వదిలేసి ఆ ఆయుధాలను తాలిబన్లు.. ప్రపంచంలోని ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులకు సరఫరా చేస్తున్నట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే హమాస్ గ్రూప్‌కు తాలిబన్లు అధునాతన అమెరికా ఆయుధాలను సరఫరా చేసినట్లు తెలుస్తోంది.