Pakistan: ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్థాన్ ఆశ్రయం.. బయటపడిన వీడియోలు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్‌కు పాకిస్థాన్ రహస్యంగా సహకరిస్తోందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇరాన్ సైనిక విమానాలకు పాకిస్థాన్ చాలా కాలంగా ఆశ్రయం కల్పిస్తోందని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. జూలై 2025కు చెందిన ఓ యూట్యూబ్ వీడియోలో కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ఇరాన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, వైమానిక ఇంధన ట్యాంకర్లు నిలిపి ఉంచిన దృశ్యాలు కనిపించాయి. ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసిన కొద్ది వారాల తర్వాత ఈ విమానాలు అక్కడ కనిపించడం చర్చనీయాంశమైంది.
వివరాలు
పాకిస్థాన్‌లో ఇరాన్ విమానాలు వెల్లడించిన అమెరికా మీడియా సంస్థ
అమెరికా మీడియా సంస్థ CBS News కూడా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో టెహ్రాన్-వాషింగ్టన్ శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఇస్లామాబాద్ తటస్థతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎన్‌డిటివి(NDTV) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130H 'ఖోఫాష్' ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానం పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచినట్లు కనిపించింది. ఈ విమానం ఏప్రిల్ 11-12 మధ్య అక్కడికి చేరుకుని కనీసం మే 12 వరకు అదే ప్రదేశంలో ఉన్నట్లు పరిశోధకుడు డామియన్ సైమన్ విశ్లేషించారు.
వివరాలు
పాకిస్థాన్‌పై తీవ్రఅనుమానాలు వ్యక్తం చేసిన సెనేటర్ గ్రాహమ్
అమెరికా సెనేట్ కమిటీ సమావేశంలో సెనేటర్ గ్రాహమ్ కూడా పాకిస్థాన్‌పై తీవ్రఅనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించేందుకు పాకిస్థాన్ తమ ఎయిర్‌బేస్‌లలో విమానాలను దాచిపెడితే, శాంతి చర్చలకు వేరే దేశాన్ని మధ్యవర్తిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌కు మిగిలిన ఏకైక KC-747వైమానిక ఇంధన ట్యాంకర్ కూడా కరాచీ విమానాశ్రయంలో కనిపించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఆ విమానం ధ్వంసమై ఉండొచ్చని సమాచారం. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది.నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న CBS నివేదిక తప్పుదారి పట్టించేలా ఉందని పేర్కొంది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాలను దెబ్బతీయడానికే ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారని పాకిస్థాన్ వివరణ ఇచ్చింది.