
USA: 2001 తర్వాత అమెరికాకు వెళ్ళిన భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా (USA) వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా (NTTO) ప్రకారం, ఈ ఏడాది జూన్‌లో అమెరికా (USA) సందర్శించిన భారతీయుల సంఖ్య 2.1 లక్షలు. కానీ గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2.3 లక్షలు ఉండగా, ఈసారి 8 శాతం తగ్గుదల నమోదైంది. జులైలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి, గత ఏడాదితో పోలిస్తే 5.5 శాతం తగ్గుదల కనిపించింది.
Details
భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్
కేవలం భారతీయుల రాకే కాదు, మొత్తంగా అమెరికా (USA) అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య కూడా తగ్గిందని NTTO గణాంకాలు తెలియజేస్తున్నాయి. అమెరికా వెలుపల పౌరుల రాక జూన్‌లో 6.2 శాతం తగ్గింది. అంతకుముందు మేలో 7 శాతం, మార్చిలో 8 శాతం, ఫిబ్రవరిలో 1.9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే జనవరిలో మాత్రం 4.7 శాతం, ఏప్రిల్‌లో 0.7 శాతం పెరుగుదల కనిపించింది. అమెరికా అంతర్జాతీయ పర్యాటక మార్కెట్‌లో భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్‌గా ఉంది. అయితే మెక్సికో, కెనడా వంటి భూసరిహద్దు కలిగిన దేశాలతో పోటీ పడుతోంది. ఇదిలా ఉండగా, పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు ట్రంప్ తీసుకువచ్చిన వీసా నిబంధనల కఠినతపై ఇప్పుడే విమర్శలు చేయడం తొందరపాటవుతుందని చెబుతున్నారు.
Details
ఈసారి మాత్రం తగ్గుదల
కానీ ఈ ధోరణి కొనసాగితే మాత్రం దీని ప్రతికూల ఫలితాలు తథ్యమని సూచిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో 50 లక్షల భారతీయులు నివసిస్తున్నారు. NTTOగణాంకాల ప్రకారం 2000నుంచి 2025వరకు జూన్ నెలల్లో భారతీయ సందర్శకుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఈసారి మాత్రం తగ్గుదల కనిపించింది. ప్రధానంగా విద్యార్థి వీసాలే గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఆలస్యాలు, జాప్యాలే దీనికి కారణమని అవి పేర్కొంటున్నాయి. విద్యార్థులతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు లేదా వ్యాపార ప్రయోజనాల కోసం కూడా భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. అయితే భారతీయులు సెలవులు గడపడానికి ఇష్టపడే దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో లేదు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, యూరప్ తర్వాతే నార్త్ అమెరికా వస్తుంది.