Pakistan: జాతీయ గౌరవం కోసం భారీ చెల్లింపు.. యూఏఈ అప్పు తీర్చిన పాక్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తనపై ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అప్పును పూర్తిగా తీర్చింది. మొత్తం 3.45 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇటీవల పూర్తిగా చెల్లించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 23న అబుదాబీ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్ (ADFD)కు చెందిన 1 బిలియన్ డాలర్ల డిపాజిట్‌ను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అంతకు ముందు వారం రోజుల్లోనే మరో 2.45 బిలియన్ డాలర్లను చెల్లించినట్లు పేర్కొంది. దీంతో యూఏఈకి ఉన్న మొత్తం 3.45 బిలియన్ డాలర్ల బకాయిని పూర్తిగా క్లియర్ చేసినట్లు స్పష్టం చేసింది.
వివరాలు
రెండు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయా?
పాకిస్థాన్‌లో చెల్లింపుల సమతుల్యత (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్)ను నిలబెట్టేందుకు యూఏఈ ఈ నిధులను అప్పుగా ఇచ్చింది. అయితే ఈ రుణాన్ని యూఏఈ అకస్మాత్తుగా తిరిగి చెల్లించాలని కోరడం ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయా అన్న అనుమానాలకు కూడా ఇది దారితీసింది. గత ఏడు సంవత్సరాలుగా ఈ రుణాన్ని పొడిగిస్తూ వస్తున్న యూఏఈ, ఈసారి మాత్రం రోల్ఓవర్‌కు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెలాఖరు లోపే రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకున్నట్లు 'డాన్' పత్రిక పేర్కొంది.
వివరాలు
దేశ గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం
దేశ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, అయినప్పటికీ ఇది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుందని పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. యూఏఈ రుణ చెల్లింపు డిమాండ్ ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్‌పై మరింత భారం మోపింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి పాకిస్థాన్‌కు 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందింది.
వివరాలు
విదేశీ మారక నిల్వలు బలోపేతం చేయడమే లక్ష్యం
విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సాయం అందించినట్లు సమాచారం. యూఏఈ రుణ చెల్లింపుతో ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేయడంలో ఈ నిధులు ఉపయోగపడతాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మార్చి 27 నాటికి ఇవి సుమారు 16.4 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధితో 7 బిలియన్ డాలర్ల బైలౌట్ ప్యాకేజీ కింద కొనసాగుతున్న పాకిస్థాన్‌కు, ఇటీవల 1.2 బిలియన్ డాలర్ల విడత విడుదలకు సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరింది.