LOADING...
USA: అమెరికా విమానాశ్రయాల్లో భారీ క్యూలు.. గంటల తరబడి వేచి చూస్తున్న ప్రయాణికులు
అమెరికా విమానాశ్రయాల్లో భారీ క్యూలు.. గంటల తరబడి వేచి చూస్తున్న ప్రయాణికులు

USA: అమెరికా విమానాశ్రయాల్లో భారీ క్యూలు.. గంటల తరబడి వేచి చూస్తున్న ప్రయాణికులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటుచూసినా భారీ క్యూ లైన్లు కనిపిస్తుండగా, సెక్యూరిటీ చెకప్‌ల కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. షట్‌డౌన్‌ ప్రభావం ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమైన ఈ పాక్షిక షట్‌డౌన్‌ కారణంగా, జీతాలు లేకుండా పనిచేయాల్సి రావడంతో పలువురు ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతున్నారు. బుధవారం నాటికి టీఎస్‌ఏకు చెందిన 30%కు పైగా సిబ్బంది న్యూయార్క్‌, హ్యూస్టన్‌, అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

వివరాలు

భద్రత కోసం ప్రత్యామ్నాయ చర్యలు

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని 14 విమానాశ్రయాల్లో సెక్యూరిటీ స్క్రీనింగ్‌ పనులకు ఇమిగ్రేషన్‌ ఏజెంట్లు, హోంలాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్‌ అధికారులను రంగంలోకి దించారు. అదనంగా భద్రతా అవసరాల దృష్ట్యా నేషనల్‌ గార్డ్‌ దళాలను మోహరించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

వివరాలు

వివాదం కారణం

ఈ షట్‌డౌన్‌కు ప్రధాన కారణం డీహెచ్‌ఎస్‌కు నిధుల కేటాయింపుపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నెలకొన్న విభేదాలే. మిన్నెపొలిస్‌లో ఇద్దరు అమెరికన్ పౌరుల మృతిపై ఇమిగ్రేషన్‌ విధానాల్లో మార్పులు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్‌ అధికారులు మితిమీరిన బలం వినియోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికి విరుద్ధంగా పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో సరిహద్దు భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, గత ప్రభుత్వ సడలింపులను సరిదిద్దుతున్నామని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. ఈ అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిధుల విడుదల నిలిచిపోయింది.

Advertisement

వివరాలు

రాజీనామాలు, ఉద్యోగుల కష్టాలు

షట్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 860 మందికి పైగా టీఎస్‌ఏ అధికారులు రాజీనామా చేశారు. మరోవైపు సుమారు 50 వేల మంది జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి కొంతమంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లకుండా విమానాశ్రయాల్లోనే, కార్లలోనే నిద్రిస్తున్నట్లు సమాచారం. మరికొందరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement

వివరాలు

భవిష్యత్తుపై ఆందోళనలు

ఈ పరిస్థితి కొనసాగితే చిన్న విమానాశ్రయాలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొత్త సిబ్బందిని నియమించడం కూడా సవాలుగా మారింది. ఒక టీఎస్‌ఏ అధికారికి శిక్షణ ఇవ్వడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువ మంది రాజీనామా చేస్తే, రాబోయే రోజుల్లో ఎయిర్‌ ట్రాఫిక్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు మూడు నుంచి నాలుగు గంటలకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది టీఎస్‌ఏ చరిత్రలోనే అత్యధికమని అధికారులు చెబుతున్నారు.

Advertisement