Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భారీ సెటిల్మెంట్.. బాధితురాలికి రూ.687 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్‌కు సహకరించారన్న ఆరోపణలపై దాఖలైన కేసును పరిష్కరించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందుకొచ్చింది. ఈ క్రమంలో బాధితురాలికి సుమారు రూ.687 కోట్లు చెల్లిస్తూ సెటిల్మెంట్‌కు అంగీకరించినట్లు వెల్లడించింది. ఎప్‌స్టీన్ బాధితుల తరఫున ఒక మహిళ అక్టోబర్‌లో అమెరికాలోని రెండో అతిపెద్ద బ్యాంక్‌పై ఈ దావా వేసింది. ఎప్‌స్టీన్ నేరాలకు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ బాధితులను రక్షించకుండా, లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె ఆరోపించారు. అలాగే ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కూడా బ్యాంక్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖండించింది. తమ బ్యాంక్ సాధారణ సేవలు అందించిన కస్టమర్లకు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న విషయం తెలియదని తెలిపింది.
వివరాలు
బాధితులకు ఆర్థిక ఉపశమనం
ఈ కేసుపై అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జెడ్ రాకాఫ్ జనవరిలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్దేశపూర్వకంగానే ఎప్‌స్టీన్‌కు సహాయం అందించినట్లు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును ముగించేందుకు రూ.687 కోట్లకు సెటిల్మెంట్ చేసుకోవాలని బ్యాంక్ నిర్ణయించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ప్రతినిధులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు కోర్టులో వెల్లడించారు. అయితే, ఎప్‌స్టీన్ లైంగిక అక్రమ రవాణా నేరాలకు తాము సహకరించలేదనే తమ వైఖరిని బ్యాంక్ కొనసాగిస్తోంది. ఈ సెటిల్మెంట్ బాధితులకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని వారి న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని కోర్టు ఆమోదించాల్సి ఉంది. వచ్చే గురువారం న్యాయమూర్తి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.