
Trump: అమెరికా రెవెన్యూ శాఖలో భారీ కలకలం.. 20 వేల ఉద్యోగాల కోత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా తాజాగా రెవెన్యూ విభాగంలో మేకోవర్ మొదలైంది.
యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించింది. దీని ప్రకారం సిబ్బందిలో 20 నుంచి 25 శాతం మందికి లే ఆఫ్‌లు ఇవ్వనున్నారు.
ఈ ప్రక్రియను మొదట పౌర హక్కుల కార్యాలయం నుంచి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. సంబంధిత ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్స్ వెళ్లాయని సమాచారం.
IRS పంపిన మెయిల్స్ ప్రకారం, ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో భాగంగా పౌర హక్కుల విభాగంలోని 75 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు.
Details
బైఅవుట్ పథకం అమలు
మిగతా ఉద్యోగులను ఇతర ప్రత్యేక కార్యాలయాలకు బదిలీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఈ కోతలు దశలవారీగా అమలులోకి రానున్నాయి. ఇదే సమయంలో ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌లో ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు.
ఇటీవల ఆరోగ్య విభాగంపై కూడా ట్రంప్ యంత్రాంగం దృష్టిసారించింది. ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ప్రకారం, అక్కడి సిబ్బందిని 82 వేల నుంచి 62 వేలకి తగ్గించనున్నారు.
దీని ద్వారా ఏటా సుమారు 1.8 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా. ఇక ఉద్యోగుల తొలగింపుల విషయంలో ట్రంప్ సర్కారు 'బైఅవుట్ పథకాన్ని' కూడా అమలు చేస్తున్నది.
Details
ప్రభుత్వ ఖర్చులు 100 బిలియన్ డాలర్లు తగ్గే అవకాశం
దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపి, స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించింది.
ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగాన్ని వదులుకునే వారికి ఎనిమిది నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఈ కార్యక్రమం విజయవంతమైతే ఏటా ప్రభుత్వ ఖర్చులు 100 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చని విశ్లేషకుల అంచనా.
ఇలా ట్రంప్ యంత్రాంగం ప్రభుత్వ వ్యయాన్ని కుదించేందుకు ఉద్యోగాల పరంగా పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతోంది.