Page Loader
USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం
USA Road Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
07:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని గ్రీన్‌కౌంటీలో జరిగిన ఒక దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కారులో మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యారు. కుటుంబ విహారయాత్రలో భాగంగా స్నేహితులు, బంధువులను కలసి తిరిగి ఇంటికి వస్తుండగా రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో అగ్ని అంటుకుని తల్లిదండ్రులతో పాటు వారి ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందినవారిగా గుర్తించారు.

వివరాలు 

ఉద్యోగ అవసరాల కోసం అమెరికాలోని డాలస్‌కు..  శ్రీవెంకట్‌ 

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు బెజిగం శ్రీవెంకట్‌ (40), అతని భార్య చొల్లేటి తేజస్విని (36) కాగా, వారు వరుసగా జూపిటర్ కాలనీ, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌సీఎల్ నార్త్ ఎవెన్యూ ప్రాంతాలకు చెందినవారు. ఈ దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి సిద్ధార్థ (9),మృదా (7) అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీవెంకట్ మూడున్నరేళ్ల క్రితం ఉద్యోగ అవసరాల కోసం అమెరికాలోని డాలస్‌కు వెళ్లారు. అక్కడకు చేరిన ఆరు నెలల తరువాత తన భార్య తేజస్విని, పిల్లలను కూడ డాలస్‌కు తరలించారు. అనంతరం తండ్రి పశుపతినాథ్,తల్లి గిరిజలను కూడా అమెరికాకు తీసుకెళ్లారు. శ్రీవెంకట్‌ సోదరి దీపిక,అతని మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

వివరాలు 

గ్రీన్ కౌంటీ ప్రాంతంలో మినీ ట్రక్కు కారు ఢీ  

ఇటీవల సెలవుల సందర్భంగా శ్రీవెంకట్ కుటుంబం అట్లాంటాకు వెళ్లింది. అక్కడ మామ ఇంట్లో మూడు రోజులు, అనంతరం సోదరి ఇంట్లో మరో మూడు రోజులు గడిపారు. అట్లాంటా నుంచి తిరుగు ప్రయాణం సమయంలో శ్రీవెంకట్ తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారు. శ్రీవెంకట్, తేజస్విని తమ పిల్లలతో కలిసి ఆదివారం తెల్లవారుజామున డాలస్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే గ్రీన్ కౌంటీ ప్రాంతానికి రాగానే వారి కారు ఒక మినీ ట్రక్కుతో ఢీకొంది. ఆ ట్రక్కు తప్పు దారిలో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో వారు నలుగురూ అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినట్లు వారి బంధువులు వెల్లడించారు.

వివరాలు 

ప్రమాద స్థలంలో శ్రీవెంకట్ కుమారుడి స్కూల్ ఐడీ లభ్యం 

ప్రమాద స్థలంలో శ్రీవెంకట్ కుమారుడు సిద్ధార్థ స్కూల్ ఐడీ కార్డు లభ్యమైంది. దానిని ఆధారంగా తీసుకొని పాఠశాలకు వెళ్లి విచారణ జరిపిన అధికారులు శ్రీవెంకట్ చిరునామాను తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉండటంతో అతని కుటుంబం అట్లాంటాలోని దీపిక ఇంటికి వెళ్లిన విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆమెకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహం కొంత భాగం లభ్యమవడంతో, పోలీసులు డీఎన్‌ఏ నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ప్రయోగశాలకి పంపించారు.