LOADING...
Sheikh Hasina: మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్‌ హసీనా
మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్‌ హసీనా

Sheikh Hasina: మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్‌ హసీనా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటుగా స్పందించారు. గతేడాది దేశంలో చెలరేగిన మారణహోమాన్ని ఆపేందుకే తాను భారత్‌కు రావాల్సి వచ్చిందని, భయంతో దేశం విడిచిపెట్టలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో హింస పెరిగిపోయిందని, పాలన పూర్తిగా బలహీనమైందని విమర్శించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో చట్టాలు అమలుకాకుండా పోయాయని, పాలనా వైఫల్యం కారణంగా అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోందని హసీనా అన్నారు. ఈ పరిణామాలు భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

Details

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన హసీనా

ఇటీవల జరిగిన అల్లర్లలో 25 ఏళ్ల మైనారిటీ యువకుడు దీపూ చంద్రదాస్‌ను ఆందోళనకారులు దారుణంగా కొట్టి హత్య చేసి, అనంతరం నిప్పంటించిన ఘటనపై హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో మైనారిటీల భద్రతను కాపాడటంలో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమైందన్నారు. యూనస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, అయితే పైకి మాత్రం భారత్‌తో స్నేహం కోరుకుంటున్నట్లు బూటకపు వ్యాఖ్యలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని బలహీనపరచలేవని హసీనా స్పష్టం చేశారు.

Details

వారిని దేశభక్తులుగా అభివర్ణించడం సిగ్గుచేటు

యూనస్‌కు అండగా ఉన్న తీవ్రవాద శక్తులు దేశ ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని, వారే తనను, తన కుటుంబాన్ని ప్రాణాల కోసం దేశం విడిచిపెట్టే పరిస్థితికి నెట్టారని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దౌత్య కార్యకలాపాలను రక్షించి, వాటిని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె గుర్తుచేశారు. కానీ యూనస్‌ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా గూండాలకు మద్దతిస్తూ, వారిని దేశభక్తులుగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. తమ పాలనలో తీవ్రవాదులుగా గుర్తించి జైలులో పెట్టిన వ్యక్తులను యూనస్‌ ప్రభుత్వం విడుదల చేసి, మళ్లీ ప్రజాజీవితంలోకి అనుమతించిందని హసీనా ఆరోపించారు. ఇదే కారణంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు మరింత తీవ్రమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Details

హాదీపై కాల్పుల కేసులో కీలక ప్రకటన 

ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌ యువనేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హాదీపై కాల్పుల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫైసల్ కరీం మసూద్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. అతడిపై ప్రయాణ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మసూద్‌ బంగ్లాదేశ్‌లోనే ఉన్నప్పటికీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తరచూ తన స్థానాలను మార్చుకుంటున్నాడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. అతడి కదలికలపై నిఘా పెట్టేందుకు బహుళ దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.

Advertisement