LOADING...
Trump:ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్‌-అఫ్గాన్‌ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్‌ వ్యాఖ్య
ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్‌-అఫ్గాన్‌ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్

Trump:ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్‌-అఫ్గాన్‌ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్‌ వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్‌ అప్రమత్తమైపోతున్నారు. ఇప్పటికే తాను ఏడు యుద్ధాలను ఆపగలిగానని, ఇప్పుడు ఎనిమిదో యుద్ధాన్ని కూడా నిలిపివేయబోతున్నానని ఆయన తెలిపారు. గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమవుతూ, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో విలేకరులతో మాట్లాడినప్పుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను ఆపబోయే ఎనిమిదో యుద్ధం (గాజాలో) అవుతుంది. అంతేకాక, పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉన్నట్టు విన్నాను. నేను తిరిగి వచ్చేవరకు అది ఆగిపోతుంది. యుద్ధాలను ఆపడం నా నైపుణ్యం," అని ఆయన తెలిపారు.

వివరాలు 

రష్యా రాజీకి రాకపోతే తోమహాక్‌ రంగంలోకి .. 

టారిఫ్‌లను ఆయుధంగా వాడి తాను సంక్షోభాలను పరిష్కరించానని పునరుద్ఘాటించారు. దీని ఉదాహరణగా భారత్-పాక్‌ మధ్య సైనిక ఉద్రిక్తతను చూపించారు. ఆ రెండు దేశాలపై 100 నుంచి 200 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించగానే, కేవలం 24 గంటల్లో ఘర్షణ ఆగిపోయిందని చెప్పారు. "టారిఫ్‌లు విధించే శక్తి లేకపోతే, ఆ సమస్యను నేనెప్పటికీ పరిష్కరించలేకపోయేవాడిని," అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై కూడా ట్రంప్‌ స్పందించారు.ఈ యుద్ధం పరిష్కారం కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. "మాస్కో రాజీకి రాకపోతే, నేను కీవ్‌ ప్రభుత్వానికి తోమహాక్‌ క్షిపణులను అందిస్తాను," అని హెచ్చరించారు. ఆ చర్య పుతిన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని తెలిపారు. "అది సరైన నిర్ణయమే అవుతుంది," అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

క్షిపణులను ఇస్తాననడంపై స్పందించిన రష్యా అధినేత పుతిన్

ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడిన కొద్ది గంటలకే వెలువడటం గమనార్హం. జెలెన్‌స్కీతో 'తోమహాక్‌' ఆయుధాలపై చర్చ జరిగినట్టు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దీనిపై తీవ్ర ప్రతిస్పందన తెలిపారు. "అమెరికా ఉక్రెయిన్‌కు ఈ క్షిపణులను అందిస్తే, మాస్కో-వాషింగ్టన్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి," అని హెచ్చరించారు. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ, "అలా జరిగితే ఉద్రిక్తతలు నాటకీయంగా పెరుగుతాయి. ఒక దీర్ఘశ్రేణి క్షిపణి రష్యాపైకి వస్తుంటే, దానిలో అణ్వస్త్రం కూడా ఉండవచ్చని మేము భావిస్తాం. అప్పుడు రష్యా ఎలా స్పందించాలో సైనిక నిపుణులే నిర్ణయిస్తారు," అని పేర్కొన్నారు.

వివరాలు 

'తోమహాక్‌' క్షిపణి ఏంటీ? 

'తోమహాక్‌' అనేది దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికా అనేక యుద్ధాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన క్షిపణి. ఇరాక్‌, సిరియా,లిబియా,గల్ఫ్‌, యెమెన్‌ వంటి యుద్ధాల్లో అమెరికా దీనిని విపరీతంగా ఉపయోగించింది. ఇది సముద్రంలోని నౌకలు,జలాంతర్గాముల నుంచి శత్రు స్థావరాలపైకి ప్రయోగించగలిగే ల్యాండ్‌ అటాక్‌ మిసైల్‌. దీనిని 1970లలో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో జనరల్‌ డైనమిక్స్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. 1983 నాటికి అమెరికా సైన్యం దీనిని వినియోగంలోకి తెచ్చింది.5.6మీటర్ల పొడవు కలిగిన ఈ క్షిపణి 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సరిగ్గా తాకగలదు. గంటకు సుమారు 880 కిలోమీటర్ల వేగంతో (సబ్‌సోనిక్‌) ప్రయాణిస్తుంది. ఉపరితలానికి కేవలం 30-35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండటంతో, రాడార్‌ వ్యవస్థలు దీన్ని గుర్తించటం చాలా కష్టసాధ్యం.

వివరాలు 

బాగ్దాద్‌ యుద్ధాన్ని ప్రారంభించి.. 

దీనిలో దాదాపు 450 కిలోల వార్‌హెడ్‌ అమర్చవచ్చు. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న 140 నౌకలు, జలాంతర్గాములు ఈ క్షిపణులను ప్రయోగించగల సదుపాయాలతో ఉన్నాయి. దీని ద్వారానే ఈ ఆయుధం ఎంత కీలకమో అర్థమవుతుంది. ఇరాక్‌పై అమెరికా ప్రారంభించిన 'డెజర్ట్‌ స్టార్మ్‌' యుద్ధంలో మొదట బాగ్దాద్‌పై దాడి చేసిన ఆయుధం కూడా ఇదే. 42 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో అమెరికా మొత్తం 297 తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో 282 లక్ష్యాలను కచ్చితంగా తాకాయి. శత్రు రక్షణ వ్యవస్థలను మోసం చేసేందుకు కొన్ని క్షిపణులు ఎత్తుగా, మరికొన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించాయి.

వివరాలు 

బాగ్దాద్‌ యుద్ధాన్ని ప్రారంభించి.. 

ఒక్కో క్షిపణి ఖరీదు సుమారు 2 మిలియన్‌ డాలర్లు ఉంటుంది. వీటిలో స్మార్ట్‌ నేవిగేషన్‌ సిస్టమ్స్‌, జీపీఎస్‌, ఇనర్షియల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ వంటి ఆధునిక సాంకేతికతలు ఉంటాయి. ఇవి ముందుగా లోడ్‌ చేసిన మ్యాప్‌లను అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటాయి. అదనంగా ఉన్న డేటా లింక్‌ వ్యవస్థ ద్వారా మార్గమధ్యంలో దిశను మార్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే మిషన్‌ను రద్దు చేసే సామర్థ్యమూ ఉంది. ఈ ఆధునికతే 'తోమహాక్‌'ను అమెరికా అత్యంత విశ్వసనీయ ఆయుధాలలో ఒకటిగా నిలిపింది.