Loading...
Donald Trump: హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై విజయం సాధించిన అనంతరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలమార్గంపై అమెరికా హక్కు ప్రకటిస్తానని ట్రంప్‌ చెప్పడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ఎలా ప్రకటిస్తారన్న దానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీనికి చట్టపరమైన ఆధారం ఏమిటన్న విషయాన్నీ స్పష్టం చేయలేదు. న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చర్యల కారణంగా ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు.

వివరాలు

159 నౌకలు, 212 విమానాలు ధ్వంసం

తమ సైనిక చర్యలు ఎంత విజయవంతమయ్యాయో పూర్తిగా బయటకు చెప్పడం లేదని, అయితే ఇరాన్‌కు మాత్రం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసని అన్నారు.

ఇరాన్‌కు చెందిన మొత్తం 159 నౌకలు సముద్రంలో మునిగిపోయాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన 212 విమానాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.

ఇరాన్‌ వద్ద ఉన్న కొన్ని విమానాలను గతంలో అమెరికా నుంచే కొనుగోలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌ నాయకత్వం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ట్రంప్‌ తెలిపారు.

ఆ దేశంలోని పలువురు కీలక నాయకులు వరుసగా మృతి చెందారని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సరైన నాయకత్వం లేకపోవడం తనకు సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు.

వివరాలు

ఇరాన్‌ వద్ద ఇంకా క్షిపణులు, డ్రోన్లు

ఇరాన్‌ వద్ద ఇప్పటికీ కొన్ని క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని ట్రంప్‌ వెల్లడించారు.

అయితే వాటిని తయారు చేసే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఇరాన్‌ రాడార్‌ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

అణ్వస్త్రాన్ని అడ్డుకోవడమే లక్ష్యం

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు గల కారణాన్ని కూడా ట్రంప్‌ వివరించారు. ఇరాన్‌ అణ్వస్త్రాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అమెరికా తన సైనిక శక్తిని అవసరానికి మించి ఉపయోగించాల్సి వచ్చిందని అంగీకరించారు.

అయినప్పటికీ ఇరాన్‌ అణ్వస్త్రాన్ని పొందకుండా అడ్డుకోవడం తప్పనిసరి అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT