#NewsBytesExplainer: ఐదేళ్ల పసివాడిని అదుపులోకి తీసుకున్న ICE.. లియామ్ రామోస్ కేసు వెనుక అసలు కథ ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమ వలసదారులపై చర్యలు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో జనవరి 20, మంగళవారం, ఐదేళ్ల బాలుడు లియామ్ కోనెజో రామోస్‌ను ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు (ICE) అదుపులోకి తీసుకున్న ఘటన సంచలనం రేపుతోంది. ప్రీ-స్కూల్ పూర్తిచేసుకుని తన తండ్రితో కలిసి ఇంటికి వస్తుండగా, ముసుగులు ధరించిన ICE ఏజెంట్లు బాలుడిని అతని ఇంటి ముందే అడ్డుకుని పట్టుకున్నారని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ ఆరోపించారు.
Details
ఐదేళ్ల పసివాడిని ఎరగా వాడారు
స్టెన్విక్ వివరాల ప్రకారం.. ఇంట్లో మరో వయోజనుడు ఉన్నప్పటికీ, బాలుడిని తన సంరక్షణలో ఉంచేందుకు అనుమతించాలని వేడుకున్నా ఏజెంట్లు నిరాకరించారు. అంతేకాదు నడుస్తున్న కారులోంచి ఆ చిన్నారిని బయటకు దింపి, ఇంటి తలుపు దగ్గరకు తీసుకెళ్లి "ఇంకెవరైనా లోపల ఉన్నారో లేదో చూడటానికి తలుపు తట్టమని ఆదేశించారని ఆమె తెలిపారు. ఒక ఐదేళ్ల బాలుడిని ఇలా ఉపయోగించడం అమానుషం. స్పష్టంగా అతడిని ఎరగా వాడారని స్టెన్విక్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Details
లియామ్ ఎవరు?
లియామ్ కోనెజో రామోస్ వ్యాలీ వ్యూ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి. ఈ ఘటన అనంతరం ICE ఏజెంట్లు అతడిని, అతని తండ్రిని కారులో తీసుకెళ్లి టెక్సాస్‌కు తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రామోస్ కుటుంబానికి ఎలాంటి బహిష్కరణ (డిపోర్టేషన్) ఉత్తర్వులు లేవని, వారి ఆశ్రయం (ఎసైలమ్) కేసు ఇంకా విచారణలోనే ఉందని స్టెన్విక్ స్పష్టం చేశారు. నేను వారి చట్టపరమైన పత్రాలను నా కళ్లతోనే చూశానని ఆమె పేర్కొన్నారు.
Details
బాలుడి సురక్షితంగా తిరిగి రావాలి
రామోస్ కుటుంబం తరపున వాదిస్తున్న న్యాయవాది మార్క్ ప్రోకోష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడు, అతని తండ్రి ఎక్కడ ఉన్నారనే విషయమే తమకు తెలియడం లేదన్నారు. వారు అడిగిన ప్రతీ నిబంధనను పాటిస్తూ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ముందుకెళ్తున్నారు. ఇది పూర్తిగా క్రూరత్వం అని ఆయన విమర్శించారు. అవసరమైతే టెక్సాస్‌లో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి రావొచ్చని తెలిపారు. ఐదేళ్ల బాలుడిని నిర్బంధించడం చట్టబద్ధమైనదా అని ప్రశ్నించారు. లియామ్ టీచర్ ఎల్లా సుల్లివన్ స్పందిస్తూ అతడు చాలా తెలివైనవాడు, దయగలవాడు, ప్రేమతో ఉంటాడు. అతని క్లాస్‌మేట్స్ అతడిని చాలా మిస్ అవుతున్నారు. అతడు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు.
Details
మరో ముగ్గురు విద్యార్థులు అరెస్టులు
ఇటీవలి వారాల్లో 18 ఏళ్లలోపు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ICE ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక 10 ఏళ్ల బాలికను ఆమె తల్లితో కలిసి స్కూల్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఆ చిన్నారి తన తండ్రికి ఫోన్ చేసి "ICE ఏజెంట్లు నన్ను స్కూల్‌కు తీసుకెళ్తున్నారని చెప్పిందని స్టెన్విక్ వెల్లడించారు. పాఠశాల ముగిసేలోపే ఆ కుటుంబాన్ని టెక్సాస్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. జనవరి 20న మరో విద్యార్థిని స్కూల్‌కు వెళ్తుండగా తీసుకెళ్లారు. గత వారం 17 ఏళ్ల విద్యార్థిని అపార్ట్‌మెంట్‌లో దాడి చేసి అరెస్టు చేశారు.
Details
పాఠశాలల చుట్టూ భయాందోళనలు
"ICE ఏజెంట్లు మా పరిసరాల్లో, పాఠశాలల చుట్టూ, బస్సులను అనుసరిస్తూ తిరుగుతున్నారు. మా పిల్లలను పార్కింగ్ లాట్లలోనే తీసుకెళ్తున్నారని స్టెన్విక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థుల్లో భయం నెలకొని, జిల్లాలో సుమారు మూడో వంతు మంది పిల్లలు పాఠశాలకు రావడం మానేశారని తెలిపారు. ఇటీవలి రెండు వారాల్లో విద్యార్థుల గైర్హాజరు రేటు 20 నుంచి 40 శాతం వరకు పెరిగిందని ట్విన్ సిటీస్ పరిసర పాఠశాల జిల్లాలు వెల్లడించాయి.