Page Loader
Elon Musk: స్టార్ లింక్ సేవలు నిలిపేస్తే.. కీవ్ సేనలు కుప్పకూలుతాయ్ : ఎలాన్ మస్క్
స్టార్ లింక్ సేవలు నిలిపేస్తే.. కీవ్ సేనలు కుప్పకూలుతాయ్ : ఎలాన్ మస్క్

Elon Musk: స్టార్ లింక్ సేవలు నిలిపేస్తే.. కీవ్ సేనలు కుప్పకూలుతాయ్ : ఎలాన్ మస్క్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మండిపడ్డ మస్క్, తమ 'స్టార్‌లింక్' ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తే కీవ్ సేనలు రణరంగంలో కుప్పకూలిపోతాయని హెచ్చరించారు. యుద్ధాన్ని శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ఉక్రెయిన్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ''గతంలోనే పుతిన్‌ను ముఖాముఖిగా ఎదుర్కొనాలని సవాలు విసిరాను. మరోవైపు, ఉక్రెయిన్ సైన్యానికి మా స్టార్‌లింక్ వ్యవస్థ కీలక మద్దతుగా ఉంది. ఒకవేళ ఈ సేవలను నిలిపివేస్తే, కీవ్ బలగాలు మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదేమైనా, ఉక్రెయిన్ ఓటమి ఖాయమే. అయినప్పటికీ, ఈ యుద్ధం ఏళ్ల తరబడి సాగుతుండటం విసుగు పుట్టిస్తోంది.

Details

యుద్ధం త్వరగా ముగియాలి

వాస్తవికంగా ఆలోచించేవారు దీన్ని త్వరగా ముగించాలని కోరుకుంటారని మస్క్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, వైట్‌హౌస్ సమీపంలో భారీ ఉక్రెయిన్ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు కేటాయించారని ఓ నెటిజన్ 'ఎక్స్' వేదికగా ప్రశ్నించగా, మస్క్ స్పందించారు. 'టాప్ 10 ఉక్రెయిన్ సంపన్నులపై, ముఖ్యంగా మొనాకోలో విలాస భవనాలు కలిగి ఉన్నవారిపై ఆంక్షలు విధించాలి. అలా చేస్తే, ఇటువంటి వ్యర్థ ఖర్చులకు అడ్డుకట్ట పడుతుందన్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రస్తుతం స్టార్‌లింక్ సేవలు అక్కడ కీలక భూమికను పోషిస్తున్నాయి. కీవ్ సేనలకు ఇది చాలా అవసరంగా మారింది. మస్క్ తాజా వ్యాఖ్యలు యుద్ధంపై మరోసారి చర్చనీయాంశంగా మారాయి.