Trump:'వారు మాపై పన్ను వేస్తే,మేము వారిపై పన్ను విధిస్తాము'..మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా నియమితులైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే, భారత ఉత్పత్తులపై కూడా 100 శాతం పన్నులు విధించనున్నామని పేర్కొన్నారు. అలాగే, అమెరికా-చైనా మధ్య వ్యాపార సంబంధాలు, విదేశాలు అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు వంటి అంశాలపై ట్రంప్ చర్చించారు.
అధిక పన్నులు విధించే దేశాల జాబితాలో బ్రెజిల్,ఇండియా
ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేసిన అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం ఆ దేశాల ఉత్పత్తులపై పన్నులు వేయడంలేదని తెలిపారు. ఇకపై ఈ విధానాన్ని కొనసాగించలేమని, తమ ఉత్పత్తులపై ఇతర దేశాలు పన్నులు విధిస్తే, తాము కూడా ఆ దేశాల ఉత్పత్తులపై అదే స్థాయిలో సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అధిక పన్నులు విధించే దేశాల జాబితాలో బ్రెజిల్,ఇండియా ఉన్నాయి అని కూడా ఆయన వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై బ్రెజిల్, భారత్ రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నాయని, తాము కూడా అదే విధంగా సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు.