IMF: 18 నెలల్లో 64 షరతులతో పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన IMF .. కొత్తగా మరో 11 షరతులు..
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన కొనసాగుతున్న 7 బిలియన్ డాలర్ల EFF ప్రోగ్రాం కింద పాకిస్థాన్‌పై మరో 11 కొత్త నిర్మాణాత్మక షరతులు విధించింది. దీంతో గత 18 నెలల్లో పాకిస్తాన్ పాటించాల్సిన మొత్తం షరతుల సంఖ్య 64కి పెరిగింది. ఈ వివరాలు గురువారం విడుదలైన IMF రెండో సమీక్ష స్టాఫ్-లెవల్ రిపోర్టులో వెల్లడయ్యాయి. కొత్త ఆదేశాల్లో అవినీతి నియంత్రణ, పాలనలో పారదర్శకతను బలోపేతం చేయడం, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ(FBR)సంస్కరణలు,ముఖ్యంగా షుగర్ వంటి రంగాల్లో అత్యున్నత వర్గాల ప్రాభవాన్ని తగ్గించడం ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా,"అన్ని సీనియర్ ఫెడరల్ సివిల్ సర్వెంట్స్ ఆస్తి వివరాలను డిసెంబర్ 2026లోపు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ప్రకటించేలా చేయాలి"అనే షరతును IMF స్పష్టంగా పెట్టింది.
వివరాలు
కార్యక్రమాల అమలు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో పర్యవేక్షిస్తుంది
ఈ చర్య ద్వారా వెల్లడైన ఆదాయం,ఉన్న ఆస్తుల మధ్య ఉన్న భేదాలను గుర్తించడమే లక్ష్యమని IMF చెబుతోంది. ఈ నియమాన్ని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకూ వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ డేటాబేస్‌కు కమర్షియల్ బ్యాంకులకు పూర్తి ప్రాప్యత ఇవ్వనుంది. అదే విధంగా,అక్టోబర్ 2026లోపు అవినీతి ప్రమాదం ఎక్కువగా ఉన్న 10 శాఖలపై రిస్క్ అంచనాల ఆధారంగా ఒక టైం-బౌండ్ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలి. ఈ కార్యక్రమాల అమలు పర్యవేక్షణను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) నిర్వహిస్తుంది. ఇంకా రిమిటెన్స్ ఛార్జీల సమీక్ష, పన్ను సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, పవర్ సెక్టర్ ప్రైవేటైజేషన్ రోడ్‌మ్యాప్‌ను పూర్తి చేయడం వంటి మరిన్ని షరతులను IMF ఈ జాబితాలో చేర్చింది.
వివరాలు
బాహ్య రుణాలపై ఆధారపడుతున్న పాకిస్థాన్
ఇప్పటికే భారీ ఎనర్జీ చార్జీలు, దూకుడైన పన్ను చర్యలు, కఠిన ద్రవ్య-ఆర్థిక నియంత్రణలతో ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్‌కు, ఇప్పుడు ఈ కొత్త షరతులు కూడా తోడయ్యాయి. ఇప్పటికీ పాకిస్తాన్ భారీగా బాహ్య రుణాలపై ఆధారపడుతూ ఉంది. గత ఏడాది నుంచి IMF, వరల్డ్ బ్యాంక్‌ల నుండి దేశం 3.3 బిలియన్ డాలర్లు పొందింది. 7 బిలియన్ డాలర్ల ప్రోగ్రాం రెండో ఏడాదిలోకి ప్రవేశించిన ఈ దశలో, మొత్తం 64 షరతులు—ప్రయర్ యాక్షన్లు, స్ట్రక్చరల్ బెంచ్‌మార్కులు, ఇండికేటివ్ టార్గెట్లు—పాకిస్తాన్ ఎన్నడూ చూడని స్థాయి పర్యవేక్షణ వ్యవస్థగా నిలుస్తున్నాయి. ఈ షరతులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతర నిబందనలు నెరవేరినప్పుడే తదుపరి విడత నిధులు విడుదల కానున్నాయి.