US elections: వలస దుమారం! అమెరికా అధ్యక్ష ఎన్నికల అత్యంత వివాదాస్పదం
అమెరికా వెళ్లాలనేది ఎంతోమంది కల. ఉపాధి అవకాశాలు పొందడానికి, స్థిరపడటానికి అనేక దేశాల ప్రజలు అక్కడికి వలస వెళ్లాలని కలలు కంటారు. అందుకే ప్రతి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వలసల అంశం ఒక ప్రధాన చర్చాంశం అవుతుంది. ఈసారి కూడా అదే విధంగా వలసల అంశం మరింత వివాదాస్పదంగా మారింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానని ప్రచారం చేస్తుండగా, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మాత్రం వలస విధానాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ వలసలపై చర్చలు మరింత వేడెక్కాయి. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ట్రంప్ ప్రకటించారు.
భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వలసదారులలో ఆందోళన
ఈ ప్రకటనతో భారత్, దక్షిణాసియా దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిలో భయం నెలకొంది. అయన ప్రపంచంలోనే భారీ డిపోర్టేషన్ (తిరిగి పంపడం) చేపడతానని, శరణార్థుల విధానాన్ని సమీక్షిస్తానని చెప్పారు. ట్రంప్ ప్రకటనలతో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలకు చెందిన వలసదారులలో ఆందోళన పెరిగింది. ట్రంప్ తీసుకువచ్చే మార్పులు వలస అనుకూల సంస్థల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆయన ప్రకటించిన కఠిన వలస విధానాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. జనన హక్కు నిలిపివేయాలన్న ట్రంప్ ఆలోచన న్యాయపరంగా నిలవదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమ భవిష్యత్తుపై విదేశీయులు ఆందోళన
ఇటీవలి ర్యాలీలో ట్రంప్, హారిస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసల ద్వారా నేరగాళ్ళను, ఉగ్రవాదులను ఆమె దేశంలోకి అనుమతిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. అయితే హారిస్ మాట ఏమిటంటే, వలసలను నియంత్రించడమే కాకుండా, వలస విధానాన్ని సానుకూల మార్పులకు లోనుచేయాలన్నది. ఇందుకోసం చట్టాల్లో మార్పులు చేసేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో విదేశీయులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. గ్రీన్‌కార్డు కలిగి ఉన్న బంగ్లాదేశీయుడు మహమ్మద్ ఇక్బాల్ ట్రంప్ గెలిస్తే వలసదారుల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన ప్రకారం, అనేక మంది వలసదారులు హారిస్‌కు మద్దతు ఇస్తున్నారు.
ట్రంప్ మద్దతుదారుల్లో 90% మంది డిపోర్టేషన్‌కి అనుకూలం
మరోవైపు, జార్జియాలో ఉన్న వాసుదేవ్ పటేల్ మాత్రం ట్రంప్‌ను సానుకూలంగా చూస్తూ, చదువుకున్నవారిని, శాంతినిచూసే వారిని ఆహ్వానించడంలో ట్రంప్ మద్దతు పలుకుతున్నారని అంటున్నారు. సరిహద్దు భద్రతపై ట్రంప్, హారిస్ మద్దతుదారులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరిహద్దు భద్రత కచ్చితంగా ఉండాలనే విషయంలో కొంతమంది ఏకీభవిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారుల్లో 90% మంది డిపోర్టేషన్‌కి అనుకూలంగా ఉన్నారు, కానీ హారిస్ మద్దతుదారుల్లో 27% మాత్రమే డిపోర్టేషన్‌కు సానుకూలంగా ఉన్నారు. వలసదారుల భవిష్యత్తు, వారి కుటుంబాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది.