LOADING...
Hormuz blockade: హర్ముజ్ దిగ్బంధనం ప్రభావం.. భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం
హర్ముజ్ దిగ్బంధనం ప్రభావం.. భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం

Hormuz blockade: హర్ముజ్ దిగ్బంధనం ప్రభావం.. భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్ముజ్ జలసంధిపై అమెరికా చేపట్టనున్న నావికాదళ దిగ్బంధనం భారత్‌పై ప్రత్యక్షంగా పెద్ద ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా తీవ్ర ప్రభావాలు ఉండే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో చమురు సరఫరా తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల దేశీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నెల రోజులుగా భారత్ తన చమురు దిగుమతులను హర్ముజ్ మార్గం నుంచి మళ్లిస్తోంది. రష్యా, సౌదీ అరేబియా పశ్చిమ తీర ప్రాంతాలు, అట్లాంటిక్ బేసిన్ దేశాల నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోంది. కేప్లర్‌కు చెందిన సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నిఖిల్ దుబే ప్రకారం, హర్ముజ్ దిగ్బంధనం వల్ల భారత్‌కు తక్షణప్రభావం తక్కువగా ఉండొచ్చు. అయితే పరోక్ష ప్రభావాలు మాత్రం గణనీయంగా ఉంటాయని చెప్పారు.

వివరాలు

ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గే అవకాశం

ఇరాన్ రోజుకు సుమారు 1.6 నుంచి 2 మిలియన్ బ్యారెల్స్ చమురును ఎగుమతి చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఖార్గ్ దీవి ద్వారా హర్ముజ్ మార్గంలోనే వెళ్లి ప్రధానంగా చైనాకు చేరుతోంది. దిగ్బంధనం జరిగితే ఈ సరఫరా నిలిచిపోతుందని, దాంతో ప్రపంచ మార్కెట్లో సరఫరా మరింత తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం భారత్ దిగుమతి బిల్లుపై నేరుగా పడనుంది. ఇక ధరల పెరుగుదల కంటే పెద్ద ప్రమాదం ఇతర కీలక సముద్ర మార్గాలపై ప్రభావం పడటం. ముఖ్యంగా బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, అక్కడి నౌకాయానంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

వివరాలు

మొత్తం వాణిజ్యంలో 10-12 శాతం ఈ మార్గం ద్వారానే

ఈ మార్గం ద్వారా ప్రస్తుతం ఇండియా రష్యా, సౌదీ రెడ్ సీ పోర్టుల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ప్రపంచ మొత్తం ఇంధన వాణిజ్యంలో సుమారు 12 శాతం, మొత్తం వాణిజ్యంలో 10-12 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. హర్ముజ్, బాబ్ ఎల్ మండెబ్ రెండు మార్గాలు ఒకేసారి ప్రభావితమైతే ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు నాలుగో వంతు దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

వివరాలు

రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ సరఫరా సామర్థ్యం

ఇదిలా ఉండగా, సౌదీ అరామ్‌కోకు చెందిన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ చమురును అబ్కైక్ నుంచి యన్బు పోర్టుకు తరలిస్తోంది. అలాగే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన హబ్షాన్-ఫుజైరా పైప్‌లైన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ సరఫరా సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పైప్‌లైన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 13 నుంచి హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలను నియంత్రిస్తామని ప్రకటించారు. US సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలపై ఈ దిగ్బంధనం అమలవుతుంది. అయితే ఇరాన్‌కు చెందని పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలకు ఆటంకం కలగదని స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు

4 మిలియన్ బ్యారెల్స్ చమురు కొనుగోలు

దీంతో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారత నౌకలు ఈ మార్గం ద్వారా ముందుకు సాగేందుకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు పశ్చిమాసియా నుంచి సరఫరా తగ్గే పరిస్థితిలో భారత్ బ్రెజిల్, గయానా, అల్జీరియా, అమెరికా వంటి దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచే అవకాశముందని ఐక్రా సంస్థకు చెందిన నిపుణుడు ప్రశాంత్ వశిష్ట్ తెలిపారు. ఎల్ఎన్‌జీ విషయంలో కూడా అల్జీరియా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా ఏడేళ్ల తర్వాత భారత్ మళ్లీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసింది. సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ చమురు కొనుగోలు చేసినట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి.

వివరాలు

ఏప్రిల్ 9న పోర్టుకు చేరుకొనే అవకాశం

కేప్లర్ డేటా ప్రకారం, 'జయ' అనే ట్యాంకర్ 2 మిలియన్ బ్యారెల్స్ చమురుతో ఏప్రిల్ 9న పరదీప్ పోర్టుకు చేరింది. మరో 'ఫెలిసిటీ' అనే నౌక సిక్కా పోర్టుకు చేరనున్నట్లు సమాచారం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో, ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురు సరఫరాకు మినహాయింపు ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చమురు సరఫరా ఫిబ్రవరి లేదా మార్చిలోనే లోడ్ అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చమురును ఏ సంస్థ కొనుగోలు చేసిందనే విషయంపై స్పష్టత లేదు. పరదీప్ పోర్టులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సిక్కా పోర్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం సంస్థలు చమురు దిగుమతులు నిర్వహిస్తున్నాయి.

Advertisement