Iran: ఇరాన్ దాడుల ప్రభావం.. అబుదాబిలో భారతీయులకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యూఏఈలోని అబుదాబిలో క్షిపణి శకలాలు పడడంతో ఐదుగురు భారతీయులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు అధికారికంగా ధృవీకరించారు. యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అయితే ఆ క్షిపణి శకలాలు కెజాద్ ప్రాంతంలో రెండు చోట్ల పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వివరాలు
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స
ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు భారతీయులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లోకి తాజాగా హూతీలు కూడా ప్రవేశించినట్లు సమాచారం. యెమెన్ నుంచి శనివారం ఒక క్షిపణి ప్రయోగం జరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హూతీలు దక్షిణ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించగా తమ వైమానిక రక్షణ వ్యవస్థలు దానిని విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. అయితే ఈ దాడికి తామే కారణమని హూతీలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.