LOADING...
Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. భొలారీ ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ తొలగిస్తున్న పాక్
ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. భొలారీ ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ తొలగిస్తున్న పాక్

Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. భొలారీ ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ తొలగిస్తున్న పాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్‌ చెబుతున్నప్పటికీ, ఉపగ్రహ చిత్రాలు మాత్రం ఆ వాదనలను ఖండిస్తున్నాయి. భారత్‌ దాడిలో దెబ్బతిన్న భొలారీ ప్రాంతంలోని పాకిస్థాన్‌ వాయుసేన స్థావరంలోని హ్యాంగర్‌కు తాజాగా మరమ్మతులు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. మే 10వ తేదీన భారత్‌ ఈ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్‌బార్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ విమానం (సాబ్‌-2000) ధ్వంసమై ఉండొచ్చని భారత్‌ అంచనా వేసింది. ఈఏడాది జనవరి 28న వాంటోర్‌ సంస్థకు చెందిన ఉపగ్రహాలు భొలారీ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన చిత్రాలను తీసాయి. ఆ చిత్రాల్లో దెబ్బతిన్న హ్యాంగర్‌కు పాకిస్థాన్‌ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడైంది.

Details

హ్యాంగర్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సమాచారం

దాడిలో నష్టపోయిన ఆకుపచ్చటి పైకప్పును అప్పటికే తొలగించినట్లు స్పష్టంగా కనిపించింది. మే 10వ తేదీన పాకిస్థాన్‌ నిర్వహించిన డ్రోన్‌ దాడులకు ప్రతిగా భారత వాయుసేన భొలారీ ఎయిర్‌బేస్‌ను టార్గెట్‌ చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో జరిగిన ఈ దాడిలో హ్యాంగర్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో వాయుసేన ఏ ఆయుధాన్ని వినియోగించిందనే వివరాలను మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ దాడి చేసి ధ్వంసం చేసిన పాకిస్థాన్‌ సైనిక స్థావరాల్లో ఇప్పటికే మరమ్మతులు కొనసాగుతున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వస్తున్న ఈ వివరాలు పాక్‌ అధికారిక ప్రకటనలకు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement