Green card lottery programme: కాల్పుల ఘటన ప్రభావం.. గ్రీన్‌కార్డ్ లాటరీకి ట్రంప్ బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు పోర్చుగీస్ జాతీయుడని, అతడు అమెరికాలోకి ప్రవేశించడానికి గ్రీన్‌కార్డ్ లాటరీ విధానమే కారణమని ట్రంప్ యంత్రాంగం అభిప్రాయపడింది. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు.
Details
ఏటా 55వేల వరకు గ్రీన్ కార్డులు
'ఇలాంటి దారుణమైన వ్యక్తులను మన దేశంలోకి ఎప్పటికీ అనుమతించకూడదని క్రిస్టీ నోయెమ్ తన పోస్టులో స్పష్టం చేశారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ను సాధారణంగా గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌గా పిలుస్తారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ఈ ప్రోగ్రామ్ పనితీరును అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 55 వేల వరకు గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. అమెరికాలో వలస జనాభాలో దేశాల మధ్య వైవిధ్యాన్ని తీసుకురావడమే ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. అయితే బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనకు పాల్పడిన పోర్చుగీస్ జాతీయుడు కూడా ఇదే వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించడంతో, ఈ విధానంపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా స్పందించింది.