US‑Israel war with Iran: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం.. భారత విమానయాన రంగానికి రూ.18 వేల కోట్ల నష్టం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా దేశాల గగనతలాలు మూసివేయడంతో భారీ స్థాయిలో విమానాల రద్దు, మార్గమార్పులు జరుగుతున్నాయి. రూపాయి పతనం, ముడి చమురు ధరల పెరుగుదల, గగనతల పరిమితులు—మొత్తం కలసి విమానయాన రంగంపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం నష్టాల అంచనాలను ఖచ్చితంగా చెప్పడం కష్టమైనప్పటికీ పరిస్థితి తీవ్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
Details
గగనతలాల మూసివేత
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ దేశాల గగనతలాలను మూసివేశారు. ఫలితంగా భారతదేశానికి అత్యంత కీలకమైన పశ్చిమాసియా మార్గం తీవ్రంగా దెబ్బతింది. భారత అంతర్జాతీయ విమాన రాకపోకల్లో దాదాపు 50 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుండటం గమనార్హం.
details
1,100కు పైగా విమానాలు రద్ధూ
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 మధ్య 1,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే రోజుకు 350 నుంచి 410 విమానాలు ప్రభావితమయ్యాయి. ఈ ప్రభావం ముంబైతో పాటు దేశంలోని ఇతర విమానాశ్రయాలపై కూడా పడింది. గల్ఫ్ ప్రాంతంలో విమానయాన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. పరిస్థితిని గమనిస్తూ భారత విమానయాన సంస్థలు కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించాయి. తరువాత యుద్ధప్రాంత గగనతలాన్ని దాటకుండా మార్గాలను మార్చి యూరప్‌కు విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరించాయి.
Details
భారత విమానయాన సంస్థలకు ద్వంద్వ సమస్య
ఇప్పటికే పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా ఉత్తర మార్గాలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు పశ్చిమాసియా గగనతలం ప్రమాదకరంగా మారడం భారత విమానయాన సంస్థలకు ద్వంద్వ సమస్యగా మారింది. ఈ మార్గమార్పుల కారణంగా యూరప్, అమెరికా వెళ్లే విమానాల ప్రయాణ సమయం 2 నుంచి 4 గంటల వరకు పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఎయిర్ ఇండియా సేవలను ప్రారంభించగలిగినప్పటికీ ఇండిగో సంస్థ మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ప్రస్తుతం యూరోప్‌కు చెందిన నార్స్ అట్లాంటిక్ నుంచి తాత్కాలికంగా తీసుకున్న డ్రీమ్‌లైనర్ విమానాలను ఇండిగో ఉపయోగిస్తున్నందున యూరోపియన్ నియంత్రణ సంస్థల నిబంధనలను కూడా పాటించాల్సి వస్తోంది.
Details
ఇంధన వ్యయం పెరుగుదల
భారత విమానయాన సంస్థలకు అత్యంత పెద్ద ఖర్చు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF). మొత్తం వ్యయంలో 30 నుంచి 40 శాతం వరకు ఇది ఉంటుంది. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రమాదం నేపథ్యంలో ముడి చమురు ధరలు 11 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 2026లో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు ₹96,638కు చేరింది. ఇది ఫిబ్రవరి కంటే 6 శాతం ఎక్కువ. కోవిడ్‌కు ముందు ఉన్న ₹64,715 స్థాయితో పోలిస్తే ఇది చాలా అధికం. చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అంచనాల ప్రకారం బ్యారెల్‌కు ఒక్క డాలర్ పెరిగినా ఇండిగో సంస్థకు సంవత్సరానికి సుమారు ₹300 కోట్ల అదనపు భారం పడుతుంది.
Details
రూపాయి పతనం మరో సమస్య
మార్చి 4న రూపాయి విలువ మొదటిసారిగా డాలర్‌కు 92 దాటింది. ఆ రోజే 0.9 శాతం పడిపోగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి మొత్తం 2 శాతం క్షీణించింది. యుద్ధ భయం, పెరుగుతున్న చమురు దిగుమతులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఈ పతనానికి కారణమయ్యాయి. రూపాయి విలువ 1 శాతం తగ్గినా విమానయాన సంస్థల లాభాలు 5 నుంచి 6 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. విమానాల లీజులు ఎక్కువగా డాలర్లలోనే ఉండటంతో రూపాయి పడిపోతే లీజు ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త విమానాల కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన సంస్థలు ముందస్తు చెల్లింపులు (PDP) కూడా విదేశీ కరెన్సీలో చేయాల్సి ఉండటం వల్ల అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది.
Details
భారీ నష్టాల అంచనా
క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అంచనా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన రంగ నికర నష్టాలు ₹170 నుంచి ₹180 బిలియన్ల వరకు చేరే అవకాశం ఉంది. ఇది 2025లో అంచనా వేసిన ₹55 బిలియన్ల నష్టంతో పోలిస్తే భారీ పెరుగుదల. 2027 నాటికి ఈ నష్టాలు ₹110 నుంచి ₹120 బిలియన్లకు తగ్గే అవకాశముందని ముందుగా భావించినప్పటికీ తాజా యుద్ధ పరిస్థితులు ఈ అంచనాలను మార్చే అవకాశముంది. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా ఎయిర్ సంస్థల విమాన సామర్థ్యంలో పెద్ద భాగం మధ్యప్రాచ్య మార్గాల్లోనే వినియోగంలో ఉంది. అందువల్ల గగనతల మూసివేత ప్రభావం వీటిపై మరింతగా పడుతోంది.
Details
చిక్కుకుపోయిన ప్రయాణికులు
ఈ పరిస్థితుల్లో అత్యంత ఆందోళనకర అంశం విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల పరిస్థితి. అనేక మంది మధ్యలోనే నిలిచిపోయారు. తిరుగు ప్రయాణం చేయలేక వీసా గడువు ముగిసే ప్రమాదం కూడా ఎదురవుతోంది. గగనతల పరిమితుల కారణంగా విమానాల సంఖ్య తగ్గిపోవడంతో సీట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయి. దాంతో ఒక్కవైపు విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు సహాయం చేయడానికి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటికీ గగనతల పరిమితుల కారణంగా అదనపు విమానాలు నడపడం లేదా రక్షణ చర్యలు చేపట్టడం కష్టంగా మారింది.
Details
కొంతమేర సర్వీసులు పునరుద్దరణ
ప్రస్తుతం కొంతమేర విమాన సర్వీసులు పునఃప్రారంభమైనప్పటికీ పరిమిత గగనతలంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. యుద్ధం మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఎప్పటికప్పుడు ఉండటంతో విమానయాన రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న భారత విమానయాన రంగానికి ఇది మరో పెద్ద పరీక్షగా మారింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే యుద్ధం త్వరగా ముగియడం లేదా కాల్పుల విరమణ జరిగే అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.