
#NewsBytesExplainer: అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ సుంకాల ప్రభావం.. మాంద్యం ముప్పు నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న భారీ సుంకాల నిర్ణయంపై ఆర్థిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వివిధ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 10% సుంకాన్ని విధించగా, 60 దేశాల వస్తువులపై మరింత అధిక సుంకాన్ని ప్రకటించింది.
ఈనెల 9వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానుండగా, వాటి ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా పడే అవకాశముందని వాల్‌స్ట్రీట్ వర్గాలు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
మాంద్యం సంకేతాలు మొదలయ్యాయా?
సుంకాల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ గందరగోళానికి లోనవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అనుకోని ఘటనల వల్ల మాంద్యం ఎలా తలెత్తుతుందో గతంలో కొవిడ్-19 మహమ్మారి,2007 గృహ రుణ సంక్షోభాల నేపథ్యంలో చూశాం.
ఇప్పుడూ సుంకాల వల్ల మాంద్యం వస్తుందా అనే ప్రశ్న ఆర్థికవేత్తల మదిని తొలుస్తోంది.
యూఎస్ ఫెడ్ అట్లాంటా బ్రాంచ్ నిర్వహించే 'ఎకానమీ ట్రాకర్' ప్రకారం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.8శాతం తగ్గింది. గతేడాది చివరిలో ఇది 2.4% వృద్ధి నమోదు చేయడం గమనార్హం.
వెల్స్ ఫార్గో నివేదిక ప్రకారం, అమెరికా విధించిన సుంకాలు సగటున 23%పెరిగాయి.
1908తర్వాత ఇదే అత్యధికం.
ఇది ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని షానన్ గ్రేన్ పేర్కొన్నారు.
Details
ట్రంప్ ప్రభుత్వ వివరణ
ట్రంప్ వర్గాలు మాత్రం దీనిపై భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 'దైనా సమస్యకు పరిష్కారం అవసరం. దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ నిర్ణయాలు అవసరమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా మాంద్యం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేశారు.
మాంద్యం సంకేతాలేంటి?
ముఖ్యమైన సంకేతాల్లో ఉద్యోగాల కోత, నిరుద్యోగం పెరుగుదల ప్రధానంగా ఉంటాయి.
అమెరికా ప్రభుత్వం ప్రతి గురువారం విడుదల చేసే ఉద్యోగ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం నిరుద్యోగం పెరుగుతున్న ఆధారాలు కనిపించటం లేదు.
అపోలో అస్సెట్ మేనేజ్‌మెంట్ సంస్థ చీఫ్ ఎకనామిస్టు టార్‌స్టెన్ స్లాక్ వివరించిన వివరాల ప్రకారం, దివాలా దరఖాస్తులు పెరుగుతున్నాయి.
లాస్‌వేగాస్‌లో పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. థియేటర్లు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు.
Details
ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, పెట్టుబడులపై ప్రభావం
ఫెడరల్ ఏజెన్సీలలో ఉద్యోగులను తగ్గించే ప్రక్రియకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. దీని వల్ల తాత్కాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ సుంకాల అమలు వాయిదా వేసినా, ఇప్పటికే నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడుతున్నారు.
వ్యాపార, వినియోగ వర్గాల్లో అనిశ్చితి పెరిగి పెట్టుబడులు, ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు.
మాంద్యం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు?
ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించే బాధ్యత నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER)కి ఉంటుంది.
ఆర్థిక కార్యకలాపాల్లో క్షీణత నెలలపాటు కొనసాగితే, నియామకాలు, ఆదాయం, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, రిటైల్ విక్రయాలను పరిగణనలోకి తీసుకుని మాంద్యం వచ్చినట్లు నిర్ధారించుతారు.
ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Details
ఆర్థిక నిపుణుల అంచనాలు
గోల్డ్‌మ్యాన్ శాక్స్ చీఫ్ ఎకనామిస్టు జన్ హట్జియస్ ప్రకారం, మాంద్యం వచ్చేందుకు 60% అవకాశం ఉంది. జేపీ మోర్గాన్ ప్రకారం, ఈ సంవత్సరాంతానికి ద్రవ్యోల్బణం 4.4శాతం కి చేరవచ్చు.
ప్రస్తుతం ఇది 2.8% వద్ద ఉంది. అధిక సుంకాల ప్రభావంతో ధరలు పెరగడం, వ్యాపారంలో అనిశ్చితి పెరగడం, వినియోగ దారుల ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్‌పై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వాల్‌స్ట్రీట్ మదుపరులు, ఆర్థిక సేవల సంస్థలు, యూఎస్ ఫెడ్ వర్గాలు మాంద్యం ముప్పు ఉన్నదనే అభిప్రాయంతో ఉన్నాయి.