Indian tankers: అమెరికా దిగ్బంధనం ప్రభావం.. హర్మూజ్‌లో నిలిచిపోయిన 15 భారత నౌకలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాపై భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ మార్గం ద్వారా ప్రయాణించాల్సిన 15 భారతీయ నౌకలు ప్రస్తుతం అక్కడే నిలిచిపోయాయి. వీటిలో ఎక్కువగా ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, అలాగే ఒక కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్లు సమాచారం. అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ పరిధిలోని ఇరాన్ ఓడరేవులను సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి దిగ్బంధిస్తామని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
వివరాలు
హర్ముజ్ మార్గంలో పూర్తిగా నిలిచిపోయిన రవాణా
ఇరాన్‌కు చెందని ఓడరేవుల మధ్య హర్ముజ్ మార్గంలో రవాణాను పూర్తిగా నిలిపివేయనప్పటికీ, ఈ ప్రకటన ప్రభావంతో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ట్రాకింగ్ నివేదికల ప్రకారం ఈ జలసంధిలో రవాణా ఒక్కసారిగా మందగించింది. ఈ పరిస్థితుల్లో భారత నౌకాదళం అప్రమత్తమైంది. హర్ముజ్ వద్ద నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ సమీపంలో భారత నౌకాదళానికి చెందిన ఆరు యుద్ధనౌకలను మోహరించారు. ఈ నౌకలు వాణిజ్య నౌకలను సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటించేందుకు సహకరించనున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మొత్తం 25 భారత నౌకలు ఉండగా, వాటిలో 10 నౌకలు ఇప్పటికే సురక్షితంగా జలసంధిని దాటినట్లు సమాచారం.