Imran Khan: 85శాతం చూపు కోల్పోయిన మాజీ ప్రధాని.. విడుదల కోసం కోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని పేర్కొంటూ విడుదల చేయాలని కోరారు. జైలు పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, వైద్య, మానవతా కారణాలపై తనను విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది సల్మాన్ సఫ్దర్ కోర్టుకు వివరించారు. ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఆయన దృష్టిలో 85 శాతం కోల్పోయారని తెలిపారు. ఈ సమస్య శాశ్వతమైనదని, వైద్యులు కూడా తిరిగి కోలుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారని వాదించారు.
వివరాలు
ఎందుకు నిర్భందిస్తారో వివరణ ఇవ్వాలి
ఇస్లామాబాద్ హైకోర్టులో జరిగిన విచారణలో జైలులో దీర్ఘకాలం ఏకాంత నిర్బంధంలో ఉండడం వల్ల కంటి సమస్యలు తీవ్రమయ్యాయని, మొత్తం ఆరోగ్యం క్షీణిస్తోందని న్యాయవాది తెలిపారు. అడియాలా జైలులో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పలుమార్లు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కూడా చెప్పారు. న్యాయవాది సల్మాన్ సఫ్దర్ మరిన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఎందుకు ఉంచుతున్నారో వివరణ ఇవ్వాలని కోరారు. పంజాబ్ జైళ్ల ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, ఆదియాలా జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్‌లను కోర్టు ముందు హాజరు పరచాలని అభ్యర్థించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ పూర్తి వైద్య రికార్డులను ఆసుపత్రి నుంచి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు.
వివరాలు
విచారణను వాయిదా వేసిన కోర్టు
విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్దార్ ముహమ్మద్ సర్ఫరాజ్ డోగర్ ప్రధాన అప్పీల్‌పై దృష్టి సారించాలని సూచించారు. అయితే శిక్ష నిలుపుదల పిటిషన్‌పై ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది పట్టుబట్టారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ ప్రస్తుతం అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఆరోపణల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జరిమానాలు చెల్లించడానికి వినియోగించి, ప్రతిఫలంగా ఖాన్ ట్రస్ట్‌కు విలువైన భూములు బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు.