Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఊరట.. 14 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ ఖజానా(తోషాఖానా)అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీల 14ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
దీంతో వీరిద్దరికీ ఊరట లభించింది. పాకిస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూఖ్ నేతృత్వంలోని ధర్మాసనం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఖజానాలోని విలువైన ఆభరణాలు ఇమ్రాన్ దంపతులు అమ్ముకున్నారన్న ఆరోపణలపై పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జనవరి 31న ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు వీరికి 14 ఏళ్ళ జైలు శిక్షతోపాటు 787 మిలియన్ల జరిమానా కూడా విధించింది.
దీంతో వీరిద్దరూ పదేళ్ల పాటు రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది.
Details
తదుపరి విచారణ ఈద్ వేడుకల తర్వాత..
ఇస్లామాబాద్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ...ఈ కేసులో తన భార్యకు ఏమాత్రం ప్రమేయం లేదని చెబుతూ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం పాకిస్తాన్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతుల జైలు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసు తదుపరి విచారణ ఈద్ వేడుకల తర్వాత ఉంటుందని అమర్ ఫరూఖ్ స్పష్టం చేశారు.