Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నిక్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. సంకీర్ణం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ నుంచి నవాజ్ షరీఫ్ వరకు విజయం తమందంటే.. తమదని ప్రకటించుకుంటున్నారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఎన్నికల సంఘం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. మొత్తం 266స్థానాలకు గానూ ఇప్పటి వరకు 226 సీట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన వారు 92స్థానాల్లో, నవాజ్ పార్టీ పీఎంఎల్-ఎన్‌కు చెందిన వారు 64, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 50, ఇతరులు 20 సీట్లలో విజయం సాధించారు.
నవాజ్ షరీఫ్‌ను తెలివి తక్కువ నాయకుడు: ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఆయన తన వర్గాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపారు. అయితే తన అభ్యర్థులు మెజార్టీ సంఖ్యలో గెలవడంపై ఇమ్రాన్ ఖాన్ శనివారం తన AI ఆధారిత 'విక్టరీ స్పీచ్'ని విడుదల చేశారు. పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ 'లండన్ ప్లాన్' విఫలమైందని ప్రకటించారు. 'ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని, ఓటు వేసి, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం ద్వారా, పౌరుల హక్కులం, స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు' అంటూ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌ను తెలివి తక్కువ నాయకుడిగా అభివర్ణించారు. తన పార్టీ 30సీట్లతో వెనుకబడినప్పటికీ విజయ ప్రసంగం చేశారంటూ దుయ్యబట్టారు.