Imran Khan: 'ప్రాణాలతో బయటపడతానో లేదో తెలియదు'.. ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని,ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు,తన భార్య బుష్రా బీబీకి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు,న్యాయస్థానం,ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన ఈ మేరకు రాసిన లేఖను తన న్యాయవాది సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. వైద్య చికిత్సతో పాటు జైలులో కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయాలని ఇమ్రాన్ కోరారు.
వివరాలు
22 గంటల పాటు ఏకాంత నిర్బంధం
జైలులో తనను రోజుకు 22 గంటల పాటు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు.
జైలులోని ఇతర ఖైదీలతో కూడా తనను మాట్లాడనివ్వడం లేదని తెలిపారు.
కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో సమావేశమయ్యేందుకు అనుమతి ఇవ్వడం లేదని, తన కుమారులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం చదువుకోవడానికి పుస్తకాలు, సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్ సౌకర్యం కూడా లేకుండా చేశారని ఆరోపించారు.
వివరాలు
గతంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించా: ఇమ్రాన్ ఖాన్
దీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉండటం, సరైన వైద్య సంరక్షణ అందకపోవడం వల్ల తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.
ప్రస్తుతం తన వయసు 74 ఏళ్లు అని, ఈ వయసులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనను ప్రాణాలతో బయటపడలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు తన భార్య బుష్రా బీబీ కంటిచూపు కూడా క్రమంగా తగ్గిపోతోందని వెల్లడించారు.
వెంటనే శస్త్రచికిత్స చేయించకపోతే ఆమె శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో తాను ఆసుపత్రులను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించానని గుర్తుచేశారు. అలాంటి తనకు, తన భార్యకు ఇప్పుడు సరైన వైద్యం అందించాలని కోరారు.
వివరాలు
సుప్రీంకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు
తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రికి తరలించాలని, కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి సమావేశమయ్యే అవకాశం కల్పించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఇమ్రాన్ ఖాన్ గుర్తుచేశారు.
అలాగే తన కుమారులతో వారానికి రెండుసార్లు ఫోన్లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆగస్టు 18న న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
అయితే అధికారులు ఇప్పటివరకు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపించారు.
వివరాలు
సుప్రీంకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు
ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో తన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.
ఇటీవల తన రక్తపోటు (బీపీ) భారీగా పెరిగిందని, దీనివల్ల మెదడులో రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు వెల్లడించారు.
తాను ప్రాణాలతో ఉంటేనే తనపై వచ్చిన ఆరోపణల్లో నిర్దోషినని నిరూపించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పరిస్థితి మరింత విషమించకముందే మానవతా దృక్పథంతో స్పందించి తనకు, తన భార్యకు తగిన వైద్యం అందేలా న్యాయం చేయాలని న్యాయమూర్తులను ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.