Imran Khan: నా తండ్రి బతికే ఉన్నాడనటానికి ఆధారాలు చూపండి: ఇమ్రాన్ ఖాన్ కుమారుడు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని బయటకు వచ్చిన వార్తలను ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీం ఖాన్ స్పందించారు. ఆయన తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ప్రభుత్వం ఆధారాలు చూపించాలని కోరారు.
వివరాలు
ఈ విధంగా చీకటిలో ఒంటరిగా నిర్బంధించడం తగదు
"మా నాన్న 845 రోజులుగా జైల్లో ఉన్నారు. గత నెలన్నర రోజులుగా ఆయనను 'డెత్ సెల్'లో ఒంటరిగా ఉంచారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, మా కుటుంబసభ్యులను ఆయనను కలవడానికి అనుమతించడం లేదు. ఫోన్ ద్వారా కూడా ఆయనతో మాట్లాడనివ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాకు ఏ సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ విధంగా చీకటిలో ఒంటరిగా నిర్బంధించడం తగదు. మా నాన్న ఆరోగ్యం గురించి మాకు తెలియకుండా ఉంచే ప్రయత్నం ఇది. ఇలాంటి అమానవీయ నిర్బంధం వల్ల ఏమైనా సమస్యలు చోటుచేసుకుంటే, దానికి పాకిస్తాన్ ప్రభుత్వం,అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలి'' అని ఖాసీం ఖాన్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు.
వివరాలు
సోషల్ మీడియాలో ఆయన మృతి చెందినట్టు వార్తలు
ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని,తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ప్రభుత్వం సాక్ష్యాలు చూపించాలని ఆయన కోరారు. రాజకీయ కుట్రల భాగంగా ఇమ్రాన్‌ను జైలుకు పంపారని,వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి అడియాలా జైలులో ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆయన మృతి చెందినట్టు వార్తలు ఒక్కసారిగా చెలరేగాయి. బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో దీనిని ప్రస్తావించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అసీమ్ మునీర్,నిఘా విభాగం (ISI)కలిసి ఇమ్రాన్‌ను హతమార్చినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. పలు మీడియా సంస్థలు కూడా ఇలాంటి సమాచారం ప్రచురించాయని సోషల్ మీడియాలో కొంతమంది పేర్కొన్నారు.
వివరాలు
ఇమ్రాన్ సోదరీమణులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి
ఈ ప్రచారం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఇటీవల జైలు వద్దకు వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. పైగా, సోదరీమణులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని వారు వాపోయారు. ఈ ఘటనపై ప్రతిస్పందించిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీనిపై జైలు అధికారులు, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన విడుదల చేశారు.