ఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి
ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు. కానీ ఒక అమ్మాయి ఆశ్చర్యకరంగా ఏకంగా విమానంలో ఆఫీసుకు వెళ్లివస్తోందట. ఆమె ఎవరు? విమానంలో ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నారు? ఆమె ఎక్కడ నివాసం ఉంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా సౌత్ కరోలినాలోని చార్లెస్టన్‌కు చెందిన సోఫియా (21) యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతున్నారు. అలాగే న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. అయితే న్యూజెర్సీలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆమె శివారు ప్రాంతాల్లో ఉన్నా కూడా నెలకు 3,400 డాలర్ల అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
అవాక్కవుతున్న నెజిజన్లు
సోఫియా ఇంటర్న్‌షిప్ రెండు నెలలు మాత్రమే ఉంటుంది. ఆమె ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వారానికి ఒకరోజు మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే రెండు నెలల్లో 8రోజులు మాత్రమే ఆఫీసు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అద్దెకు ఉండే బదులుగా వారానికి ఒక రోజు చార్లెస్టన్ నుంచి న్యూజెర్సీకి విమానంలో ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చార్లెస్టన్ నుంచి న్యూజెర్సీకి 700 మైళ్ల దూరం ఉంటుంది. అయితే సోఫియా విమాన ప్రయాణం చేయడం వల్ల 8 రోజులకు కలిపి కేవలం 2,250 డాలర్లు మాత్రమే ఖర్చు కావడం గమనార్హం. ఈ విషయాన్ని సోఫియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు.