ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాయబారి ఎదురుదాడి
500 మంది మృతికి కారణమైన గాజా నగరంలోని ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితిలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ బుధవారం ఆరోపించారు. హమాస్,ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.ఇజ్రాయెల్ వైమానిక దాడి ఫలితంగా పేలుడు జరిగిందని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలను ఖండించింది.పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్‌ను సరిగా పేల్చకపోవడం వల్లే అది ఆస్పత్రి వైపు దూసుకెళ్లినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
ఆసుపత్రిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ట్వీట్
నెతన్యాహు వాదనలను రియాద్ మన్సూర్ తీవ్రంగా ఖండించారు.అతను ఒక అబద్దాలకోరని మన్సూర్ ప్రకటించాడు. ఆసుపత్రి చుట్టూ హమాస్ స్థావరం ఉందని భావించి ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని అతను ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన అనంతరం ఆ ట్వీట్ ను అతను తొలగించాడు. ఆ ట్వీట్ కాపీ తమ వద్ద ఉందని,కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు పాలస్తీనియన్లను నిందించడానికి కథను మార్చారని మన్సూర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి ఒక ప్రకటనలో ఆసుపత్రులను ఖాళీ చేయమని చెప్పాడు. వారి ఉద్దేశ్యం ఖాళీ చెయ్యాలా లేదా ఆసుపత్రిని పేల్చడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేరానికి వారే బాధ్యులు,ఈ విషయమై వారు కథలు అల్లలేరు అని అన్నారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించిన నిరసనకారులు
పాలస్తీనా రాయబారి నుండి వచ్చిన ఈ నిర్దిష్ట ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. క్రైస్తవులు నిర్వహించే ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు కారణమేమిటనే దానిపై అనిశ్చితి మధ్య కూడా, అంతర్జాతీయంగా ఈ దాడులపై పలు దేశాలు ఖండించాయి. ట్రిపోలీ నుండి టెహ్రాన్ వరకు ముస్లింలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది పాలస్తీనా శరణార్థులు నివసించే జోర్డాన్‌లోని నిరసనకారులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. లెబనాన్‌లో, US ఎంబసీ వెలుపల భద్రతా దళాలతో ప్రదర్శనకారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు రువ్వి భవనానికి నిప్పు పెట్టారు.