LOADING...
'In Spirit Of Friendship':ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. మరాఠా-యూదుల చారిత్రక బంధానికి గుర్తింపు
ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. చారిత్రక బంధానికి గుర్తు

'In Spirit Of Friendship':ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. మరాఠా-యూదుల చారిత్రక బంధానికి గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఇజ్రాయెల్‌లో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యూదులు వివక్ష, హింసను ఎదుర్కొన్నప్పటికీ.. భారత్‌లో మాత్రం వారికి గౌరవం, రక్షణ లభించిందనే చారిత్రక అనుబంధానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

17వ శతాబ్దం నుంచే మరాఠా-యూదుల అనుబంధం

మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతంలో నివసించే 'బెనె ఇజ్రాయెల్' యూదు సమాజానికి, మరాఠా సామ్రాజ్యానికి 17వ శతాబ్దం నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యుద్ధ నైపుణ్యం, విశ్వసనీయత, ధైర్యసాహసాలను గుర్తించిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. ఈ సమాజానికి చెందిన పలువురికి తన సైన్యం, నౌకాదళంలో కీలక బాధ్యతలు అప్పగించారు. మరాఠా నావికాదళంలో 'ఆరోన్ చురికర్' అనే యూదు యోధుడు నేవీ కమాండర్‌గా సేవలందించడం విశేషం. ఆయన ప్రతిభను మెచ్చిన శివాజీ మహారాజ్.. స్వయంగా ఇనామ్ భూములను కూడా బహూకరించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

వివరాలు 

మరాఠీ సంస్కృతిని ఆదరించిన బెనె ఇజ్రాయెల్

బెనె ఇజ్రాయెల్ సమాజం మహారాష్ట్ర సంస్కృతి, మరాఠీ భాషతో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకుంది. తమ మత సంప్రదాయాల ప్రకారం శనివారాల్లో చమురు మిల్లుల పనులను నిలిపివేయడంతో స్థానికులు వారిని 'శనివార్ తేలీలు'గా పిలిచేవారు. కాలక్రమేణా ఈ సమాజానికి చెందిన అనేక మంది ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబే ఆర్మీలో చేరి సేవలందించారు. ఆంగ్లో-మైసూర్, ఆంగ్లో-మరాఠా యుద్ధాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి తమ ప్రత్యేక స్థానాన్ని చరిత్రలో నిలబెట్టుకున్నారు.

Advertisement

వివరాలు 

ఇజ్రాయెల్‌లోనూ మరాఠీ సంప్రదాయాల పరిరక్షణ

1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత భారత్ నుంచి వేలాది యూదు కుటుంబాలు అక్కడికి వలస వెళ్లాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 50 వేల మందికి పైగా బెనె ఇజ్రాయెల్ వంశస్థులు నివసిస్తున్నారు. వారు ఇప్పటికీ మరాఠీ భాష, ఆహార సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కొనసాగిస్తూ తమ మూలాలను గుర్తుచేసుకుంటున్నారు. భారత్‌లో తమ పూర్వీకులకు లభించిన ఆదరణ, గౌరవానికి కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిష్ఠాపన భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య ఉన్న చారిత్రక మైత్రికి, మరాఠా-యూదు అనుబంధానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలవనుంది.

Advertisement