Donald Trump: అమెరికాలో కొత్త సుంకాల విధానం.. విదేశీ దిగుమతులపై 15% భారం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరంగా వెల్లడిస్తూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలపై కఠిన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాటలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్-1974లోని మరో నిబంధనను ఆధారంగా తీసుకుని అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై తాత్కాలికంగా 15 శాతం గ్లోబల్ టారిఫ్ అమలు చేసింది.
వివరాలు
ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోవడానికి వెనుకాడబోము: ట్రంప్
తన ప్రసంగంలో ఈనిర్ణయాన్నిసమర్థిస్తూ, అమెరికా పౌరులపై ఆదాయపుపన్ను భారాన్ని తగ్గించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు విధించడం ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చాలని ఉద్దేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేసమయంలో ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ట్రంప్ ఘాటుగా స్పందించారు. అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోవడానికైనా వెనుకాడబోమని హెచ్చరిక జారీ చేశారు. ఈవ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి.ట్రంప్ ప్రకటించిన 15శాతం టారిఫ్‌లు 150రోజులపాటు తాత్కాలికంగా అమల్లో ఉంటాయి. ఆగడువు ముగిసిన తర్వాత వాటిని కొనసాగించాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ఈ కొత్త సుంకాల ప్రభావం భారత్‌తో పాటు మరెన్నో దేశాల ఎగుమతులపై పడే అవకాశం ఉండటంతో వ్యాపార వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.