
ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ చేయాలన్న తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
ఈ ప్రతిపాదనకు 120 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
అదే సమయంలో భారత్, బ్రిటన్ సహా 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనను జోర్డాన్ ఐరాస జనరల్ అసెంబ్లీలో సమర్పించింది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఈ తీర్మానంలో మరికొన్ని అంశాలను కూడా పొందుపర్చారు. యుద్ధాన్ని ఆపాలని, గాజాకు మానవతా సహాయం అందించాలని, పౌరులకు భద్రత కల్పించాలన్న అంశాలు తీర్మానంలో ఉన్నాయి.
గాజా
భారతదేశం దూరంగా ఎందుకు ఉందంటే?
హమాస్ తీవ్రవాదం అంశాన్ని తీర్మానంలో పెట్టకపోవడాన్ని నిరసిస్తూ భారత్ ఓటింగ్‌కు గైర్హాజరైంది. దీన్ని అమెరికా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.
అంతకుముందు ఐక్య రాజ్యసమితిలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, హింసను మానుకోవాలని భారత్ ఇరుపక్షాలను కోరింది.
ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ యుద్ధం పట్ల భారతదేశం చాలా ఆందోళన చెందుతోందని అన్నారు.
హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వివాదంలో వేలాది మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు.
ఈ ప్రాంతంలో శత్రుత్వం పెరగడం వల్ల మానవతా సంక్షోభం మరింత పెరుగుతుందన్నారు.
గాజా
12 రోజుల్లో వీగిపోయిన నాలుగు తీర్మానాలు
అంతకుముందు, గత 12 రోజుల్లో యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 4 తీర్మానాలు వీగిపోయాయి.
ఇందులో రష్యా నుంచి రెండు ప్రతిపాదనలు రాగా, అమెరికా నుంచి ఒకటి, బ్రెజిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
గాజాలో మానవతావాద సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా తన తీర్మానంలో చెప్పి, హమాస్ దాడిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా డిమాండ్ చేసింది.
మరోవైపు, రష్యా తన ప్రతిపాదనలో గాజాలో కాల్పుల విరమణ గురించి మాట్లాడింది. అమెరికా, బ్రిటన్‌లు ఈ ప్రతిపాదనను వీటో చేశాయి.