LOADING...
MV Sunshine: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక

MV Sunshine: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వంటగ్యాస్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హర్మూజ్‌ జలసంధిని విజయవంతంగా దాటినట్లు సమాచారం వెలువడింది. 'ఎంవీ సన్‌షైన్‌' పేరుతో ప్రయాణిస్తున్న ఈ నౌక సురక్షితంగా దేశానికి చేరుకునేందుకు భారత నౌకాదళం సహా పలు కేంద్ర సంస్థలు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, అక్కడి నుంచి ఈ నౌకతో కలిపి మొత్తం 15 ఎల్పీజీ నౌకలను సురక్షితంగా భారత్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నౌకలో ఎంత పరిమాణంలో వంటగ్యాస్‌ ఉందన్నది, అది భారత్‌కు ఎప్పుడు చేరుకుంటుందన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

వివరాలు 

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదు: కాజమ్‌ ఘరీబబాదీ

మరోవైపు, హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఇరాన్‌ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజమ్‌ ఘరీబబాదీ తెలిపారు. శాంతి నెలకొన్న తర్వాత అక్కడ భద్రత మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికా నిజమైన నిబద్ధతతో వ్యవహరించడం లేదని విమర్శించారు. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదని కూడా స్పష్టం చేశారు.

Advertisement