బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం
బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండోనేషియాతో పాటు సౌదీఅరేబియాల దేశాలను కూటమిలో చేర్చేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆయా దేశాలతో బ్రిక్స్ ను విస్తరించడం ద్వారా బలాన్ని పెంచుకుని మరింత బలపడేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ ను విస్తరించాలని డ్రాగన్ భావిస్తోంది.తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ప్రక్రియలో భాగంగా చైనా ఒంటెద్దు పోకడలు పోతోందని బ్రిక్స్ ఇతర దేశాలు భావిస్తున్నాయి. ఈ మేరకు భారత్, బ్రెజిల్ డ్రాగన్ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నాయి.ఇప్పటికే ఈ కూటమికి చాలా దేశాల నుంచి సభ్యత్వం కోసం అప్లికేషన్లు అందాయి.
విస్తరణ కోసం చైనా పదేపదే లాబీయింగ్
ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సమ్మిట్ అగ్రదేశం అమెరికా(USA), యూరోపియన్ యూనియన్(EU)లకు ప్రత్యాహ్నయ శక్తిగా మారనుందని పశ్చిమ దేశాల్లో(WESTERN COUNTRIES) ఆందోళనల నెలకొన్నట్లు సమాచారం. అంతర్జాతీయ సమస్యలు,బ్రిక్స్ దేశాల మధ్య సహకారం సహా ఇతర ఆర్థిక, వాణిజ్య అవసరాలపై వచ్చే నెల ఆగస్టు 22-24 మధ్య దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సభ్య దేశాలు ఇటీవలే సన్నాహక సదస్సులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు సభ్యత్వం విస్తరణ కోసం చైనా పదేపదే లాబీయింగ్ చేసిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరఆఫ్రికాలోని అల్జీరియా తమను కూటమిలో చేర్చాలని, ఈ మేరకు 1.5 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంకులో షేర్ హోల్డర్ సభ్యుడిగా చేరతామని ఆర్జి పెట్టుకుంది.