బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
డ్రాగన్ దేశం చైనాపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ నమ్మకాన్ని కోల్పోయిందని కుండబద్దలు కొట్టారు. ఆగస్టులో దక్షిణాఫ్రికా వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు జరగనున్న వేళ సమావేశాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే మొదట సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్(BRICKS) నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ల(NSA) భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోవల్ చైనా తీరును ఎండగట్టారు. బ్రిక్స్ సమావేశాలు ఈ రెండు అతిపెద్ద దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చిగురిస్తాయని ధోవల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ధోవల్ ప్రస్తావించిన అంశాలపై తాము సానుకూలమని చైనా వెల్లడి
సన్నాహాక సదస్సులో భాగంగా ఇండియా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వివాదం సహా మరిన్ని కీలక అంశాలపై ఇద్దరు ప్రతినిధులు చర్చించారు. నియంత్రణ రేఖ(LOC) వద్ద పరిస్థితిని పరిష్కరించేందుకు ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని దోవల్ అన్నారు. దిల్లీ-బీజింగ్‌ల మధ్య సత్సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల సామరస్యత ప్రపంచ శాంతికి బాటలు వేస్తాయన్నారు. ఇందుకోసం బిజింగ్ తమతో కలిసి పనిచేయాలని కోరారు. సరిహద్దులో పరిస్థితులు పూర్వస్థితికి రావాలంటే చైనా దూకుడు తగ్గించుకోవాలని, ఇప్పటికే డ్రాగన్ నమ్మకాన్ని పోగొట్టుకుందన్నారు. ధోవల్ ప్రస్తావించిన అంశాలపై చైనా సానుకూలంగానే ఉందని వాంగ్ యీ బదులిచ్చారు. రెండు దేశాల సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని పేర్కొన్నారు