Page Loader
India- Canada: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ..  ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై చర్చ 
జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై చర్చ

India- Canada: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ..  ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్నారు. జీ-7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనే ఉద్దేశంతో మంగళవారం ఆయన అక్కడకు చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంతో మోడీ ఈ సమావేశాలకు హాజరయ్యారు. గమనించదగిన విషయం ఏంటంటే, భారతదేశం జీ-7 దేశాల్లో సభ్యదేశం కాకపోయినా, 2019 నుంచి మోడీ ఈ శిఖరాగ్ర సదస్సులకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం సమయంలో భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా బలహీనమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఈ పర్యటనను మైలురాయిగా భావిస్తున్నారు.

వివరాలు 

ప్రజాస్వామ్య పరిరక్షణకు,విలువల బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి : మోదీ 

జీ-7 సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య తిరిగి ధృడమైన సంబంధాలు ఏర్పడే దిశగా ఈ భేటీ సంకేతాలిచ్చింది. భారత్-కెనడా సంబంధాలు ఎంతో ప్రాధాన్యంతో కూడుకున్నవని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అంతేగాక, ప్రజాస్వామ్య పరిరక్షణకు,విలువల బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టేందుకు, వాటిని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, సహకారంతో వనరులను సమర్థవంతంగా వినియోగించి మానవాళి శ్రేయస్సు కోసం పనిచేయవచ్చని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు జీ-7 ఒక సముచిత వేదిక

కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతూ, జీ-7 సదస్సులో మోడీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. 2018 నుంచే భారతదేశం జీ-7 సమావేశాల్లో భాగస్వామ్యం అవుతోందని పేర్కొంటూ, ఇది దేశానికి ఉన్న ప్రాధాన్యతను, మోడీ నాయకత్వానికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. అంతేగాక, ప్రపంచ సమస్యలను చర్చించేందుకు, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు జీ-7 ఒక సముచిత వేదిక అని పేర్కొన్నారు. భవిష్యత్తును మెరుగుపరచేందుకు, ఉగ్రవాదం సహా ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కలసి పోరాడాల్సిన అవసరం ఉందని కార్నీ వ్యాఖ్యానించారు.