Loading...
Bangladesh: షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారత్ ఎటువంటి షరతులు విధించలేదు: బంగ్లాదేశ్
షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారత్ ఎటువంటి షరతులు విధించలేదు: బంగ్లాదేశ్

Bangladesh: షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారత్ ఎటువంటి షరతులు విధించలేదు: బంగ్లాదేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం,బంగ్లాదేశ్ మధ్య మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించేందుకు భారత్ రెండు షరతులు విధించిందంటూ వచ్చిన వార్తలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఈ విషయంలో భారత్‌తో ఎలాంటి చర్చలు జరగలేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారమే హసీనాను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

భారత్ విధించిందంటూ ప్రచారంలోకి వచ్చిన రెండు షరతులు

హసీనాను తిరిగి అప్పగించే విషయంలో భారత్ రెండు షరతులు పెట్టినట్లు బీబీసీ బంగ్లా ఓ కథనాన్ని ప్రచురించింది.

మొదటి షరతు ప్రకారం.. బంగ్లాదేశ్ ఆర్మీ విమానంలోనే హసీనా భారత్‌కు పారిపోయి వచ్చినందున, ఆమెను తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఆ దేశ సైన్యానిదేనని భారత్ పేర్కొన్నట్లు కథనంలో తెలిపింది.

రెండో షరతు ప్రకారం.. హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం బంగ్లాదేశ్ కల్పించాలని, 2024 విద్యార్థి ఉద్యమ సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను కొత్తగా చేపట్టాలని భారత్ కోరినట్లు పేర్కొంది.

వివరాలు 

మా మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదు

అయితే, భారత్‌తో ఈ అంశాలపై ఎలాంటి చర్చలు జరగలేదని షామా ఒబైద్ ఇస్లాం స్పష్టం చేశారు.

భారత్‌తో ఈ విషయంపై ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, అలాంటి ప్రతిపాదనలు కూడా తమ దృష్టికి రాలేదని ఆమె మీడియాకు వెల్లడించారు.

హసీనాను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి బంగ్లాదేశ్ న్యాయశాఖ పరిశీలన చేస్తోందని తెలిపారు.

ఇప్పటికే తమ వైపు నుంచి పూర్తి చేయాల్సిన అన్ని చట్టపరమైన ప్రక్రియలను ముగించినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఎండీ అసదుజ్జమాన్ గతంలో వెల్లడించారు.

చట్టపరమైన ప్రక్రియలో భాగంగా తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించామని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అప్పగింత అభ్యర్థనలు అందినట్లు ధ్రువీకరించిన భారత్

షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనలు తమకు అందాయని భారత్ ఇప్పటికే ధ్రువీకరించింది.

అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశం చట్టపరమైన పరిధిలోకి వస్తుందని, నిబంధనల ప్రకారం దీనిని పరిశీలిస్తామని తెలిపారు.

డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు హసీనా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్పగింత వ్యవహారంపై చర్చ మరింత వేడెక్కింది.

ఇటీవల ఆమె న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించి, తిరిగి వెళ్లేందుకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

గైర్హాజరీలోనే హసీనాకు మరణశిక్ష

2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోయింది.

దీంతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అనంతరం 2025 నవంబరులో 2024 జులై-ఆగస్టు ఉద్యమ సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ హసీనాను దోషిగా నిర్ధారించింది.

ఆమె గైర్హాజరీలోనే ఈ తీర్పు వెలువడింది. ఒక కేసులో మరణశిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధించింది.

ప్రస్తుతం ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావాలన్న ప్రయత్నాల నేపథ్యంలో భారత్ వైఖరిపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT