LOADING...
India-Italy: ప్రపంచ వేదికపై బలపడుతున్న భారత్‌-ఇటలీ బంధం
ప్రపంచ వేదికపై బలపడుతున్న భారత్‌-ఇటలీ బంధం

India-Italy: ప్రపంచ వేదికపై బలపడుతున్న భారత్‌-ఇటలీ బంధం

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఇటలీ సంబంధాలు ప్రస్తుతం కీలక దశలోకి ప్రవేశించాయి.గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయి. స్వేచ్ఛ,ప్రజాస్వామ్య విలువలను ఆధారంగా చేసుకుని ఏర్పడిన ఈ మైత్రి ఇప్పుడు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ప్రపంచ రాజకీయ,ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో భారత్‌, ఇటలీ మధ్య సహకారం మరింత విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరవై ఒకటో శతాబ్దంలో దేశాల అభివృద్ధి,భద్రత కొత్త ఆవిష్కరణలు,ఇంధన మార్పులు,వ్యూహాత్మక స్వావలంబనపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర బలాలను సమన్వయం చేసుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత్‌,ఇటలీలు సంకల్పించాయి. భారతదేశ ఆర్థికవిస్తరణ,ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్నిఇటలీ పారిశ్రామిక సామర్థ్యంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక దేశం బలం మరొక దేశ అభివృద్ధికి దోహదపడేలా సహకారాన్ని విస్తరిస్తున్నాయి.

వివరాలు 

విమాన,అంతరిక్ష రంగాల్లో ఇటలీకి నైపుణ్యం

అంతరిక్ష రంగంలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఉపగ్రహ సాంకేతికత,అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ గణనీయ పురోగతి సాధించింది. దీనికి విమాన,అంతరిక్ష రంగాల్లో ఇటలీకి ఉన్న నైపుణ్యం జతకావడం వల్ల కొత్త తరహా సాంకేతికతల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఉమ్మడి పరిశోధనలు,శాస్త్రీయ కార్యక్రమాలకు ఇది బలమైన పునాది వేస్తోంది. ప్రపంచ స్థిరత్వానికి భద్రత,సుస్థిర అభివృద్ధి కీలకమని భారత్‌,ఇటలీలు భావిస్తున్నాయి. అందుకే రక్షణ,భద్రత,వ్యూహాత్మక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నాయి. ఇంధన రంగాన్ని ఇరు దేశాలు తమ భాగస్వామ్యానికి ప్రధాన స్తంభంగా చూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఆవిష్కరణలు,పెట్టుబడులు,అంతర్జాతీయ సహకారం అవసరమవుతోంది. ఈ దిశగా పలు రంగాల్లో భారత్‌,ఇటలీలు కలిసి ముందుకు సాగుతున్నాయి.

వివరాలు 

ఇంధన రంగంలో పరస్పర సహకారం

పచ్చ హైడ్రోజన్‌ ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రధాన కేంద్రంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉంది. పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల్లో పురోగతి సాధించిన ఇటలీకి ఇది కీలక అవకాశంగా మారుతోంది. ఇంధన రంగంలో పరస్పర సహకారం భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా ఉపయోగపడనుంది. భౌతిక, డిజిటల్‌, మానవ సంబంధాలు ఇరు దేశాలను మరింత దగ్గర చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న ఇండో-పసిఫిక్‌, మధ్యధరా ప్రాంతాల్లో భారత్‌, ఇటలీలకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. హిందూ మహాసముద్రాన్ని యూరప్‌తో అనుసంధానించే ఇండో-మధ్యధరా ప్రాంతం కొత్త ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, దత్తాంశ రంగాల్లో పెరుగుతున్న అనుబంధాలు ఈ మార్పులకు దారితీస్తున్నాయి.

Advertisement

వివరాలు 

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారత్‌-ఇటలీ సహకారం 

ఈ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న భారత్‌-మధ్యప్రాచ్యం-యూరప్‌ ఆర్థిక మార్గం ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ అనుసంధానం, ఇంధన వ్యవస్థలు, సరఫరా వ్యవస్థలను కలిపే ప్రధాన ప్రణాళికగా భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో కలిసి పనిచేయాలని భారత్‌, ఇటలీలు నిర్ణయించుకున్నాయి. భారతీయ సంస్కృతిలోని "ధర్మం" భావన బాధ్యతాయుత జీవన విధానాన్ని సూచిస్తుంది. "వసుధైవ కుటుంబకం" భావన ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని చెబుతోంది. ఇటలీ సంప్రదాయాల్లోనూ ఇలాంటి విలువలు కనిపిస్తాయి. సంస్కృతి ప్రజలను, సమాజాలను కలిపే శక్తిగా పనిచేస్తుందని ఇరు దేశాలు విశ్వసిస్తున్నాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారత్‌-ఇటలీ సహకారాన్ని మరింత విస్తరించాలని సంకల్పించాయి.

Advertisement

వివరాలు 

వాణిజ్యం బలోపేతం...

యూరోపియన్‌ సమాఖ్యతో భారత్‌ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు దోహదపడుతోంది. 2029 నాటికి భారత్‌-ఇటలీ వాణిజ్య విలువ 20 బిలియన్‌ యూరోలను దాటాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. పలు రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాయి. "మేడ్‌ ఇన్‌ ఇటలీ" అనే పేరు ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు ప్రతీకగా నిలిచింది. అదే సమయంలో "మేక్‌ ఇన్‌ ఇండియా" కార్యక్రమం ద్వారా ఉన్నత పారిశ్రామిక లక్ష్యాలను సాధించేందుకు భారత్‌ కృషి చేస్తోంది. ఈ రెండు లక్ష్యాలు సహజంగా పరస్పరం అనుసంధానమవుతున్నాయి.

వివరాలు 

సాంకేతిక రంగం ఇరు దేశాల భాగస్వామ్యానికి కేంద్రబిందువు

సాంకేతిక రంగం ఇరు దేశాల భాగస్వామ్యానికి కేంద్రబిందువుగా మారింది. కృత్రిమ మేధ,క్వాంటమ్‌ గణన వ్యవస్థలు,ఆధునిక తయారీ పద్ధతులు,కీలక ఖనిజాలు,డిజిటల్‌ మౌలిక సదుపాయాల రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి భారత్‌, ఇటలీలలో సాంకేతిక మార్పులకు దారితీస్తోంది. భారతీయ పారిశ్రామిక రంగంలో పెరుగుతున్న నవ్యతకు ఇటలీ ఆధునిక పరిశ్రమల సామర్థ్యం తోడవుతోంది. కృత్రిమ మేధ అభివృద్ధి బాధ్యతాయుతంగా, మానవ సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని సాగాలన్న దృక్పథంతో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. సామాజిక సాధికారతకు కృత్రిమ మేధ ఉపయోగపడాలని కోరుకుంటున్నాయి. భారత డిజిటల్‌ సామర్థ్యాన్ని ఇటలీ పారిశ్రామిక నైపుణ్యంతో మేళవించి సాంకేతికత మానవ గౌరవాన్ని కాపాడేలా వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇందుకోసం విశ్వసనీయమైన, సమాన అవకాశాలు కలిగిన సైబర్‌ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Advertisement