Putin: ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు.. మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి వ్యర్థం: పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-రష్యా స్నేహబంధంపై ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తేవాలన్న ప్రయత్నాలు ఫలించవని, అలాంటి చర్యలు ప్రపంచ స్థిరత్వానికే ముప్పుగా మారతాయని వ్యాఖ్యానించారు. గురువారం సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థల అధినేతలతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను రష్యాకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించిన ఆయన, భారత్ ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవడాన్ని రష్యా ఎప్పుడూ ప్రతికూలంగా చూడదన్నారు.
వివరాలు
కాలపరీక్షను తట్టుకుని నిలిచిన ఇండో-రష్యా సంబంధాలు
కాలపరీక్షను తట్టుకుని నిలిచిన ఇండో-రష్యా సంబంధాలు భవిష్యత్తులో కూడా అదే బలంతో కొనసాగుతాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని, తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదుగుతోందని పేర్కొన్న పుతిన్, దేశం సాధిస్తున్న వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన ఫలితం కాదని, ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషికి దక్కిన ప్రతిఫలమని అన్నారు.
వివరాలు
భారత్ గొప్ప దేశం.. అక్కడి ప్రజాస్వామ్యం గొప్పది
భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే సంవత్సరాల్లో మరింత విస్తరించి 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశముందని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత్‌ను గొప్ప దేశంగా అభివర్ణించిన ఆయన, అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా ప్రశంసించారు. "భారత్ గొప్ప దేశం.. అక్కడి ప్రజాస్వామ్యం గొప్పది" అని పుతిన్ పేర్కొన్నారు.