PM Modi: జులై 15 నుంచి భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం అమలు: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)జులై 15 నుంచి అమల్లోకి రానుందని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. దాదాపు ఏడాది క్రితం కుదిరిన ఈ ఒప్పందం ఇప్పుడు అమలుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా భారత రైతులు,యువత,చిన్న,మధ్య తరహా పరిశ్రమలు,స్టార్టప్‌లు,ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
వివరాలు
పలు ఉత్పత్తులపై సుంకాల భారీ తగ్గింపు
2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త ఊపు తీసుకురానుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయి. కొన్ని రకాల మద్యంపై ప్రస్తుతం ఉన్న 150 శాతం టారిఫ్‌ను 40 శాతానికి తగ్గించనుండగా, వాహనాలపై 100 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయనున్నారు. అలాగే సౌందర్య ఉత్పత్తులపై గరిష్ఠంగా 22 శాతం వరకు టారిఫ్‌లు తగ్గనున్నట్లు బ్రిటన్ వెల్లడించింది.
వివరాలు
ఏటా రూ.3.22 లక్షల కోట్ల అదనపు వాణిజ్యం
ఈ ఒప్పందం వల్ల దీర్ఘకాలంలో భారత్, బ్రిటన్ మధ్య ఏటా 2,550 కోట్ల పౌండ్ల విలువైన అదనపు వాణిజ్యం జరిగే అవకాశముందని బ్రిటన్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.22 లక్షల కోట్లకు సమానం. అలాగే భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) సుమారు రూ.64,474 కోట్ల మేర పెరిగేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది. భారత ఎగుమతులకు కొత్త ఊపు ఈ వాణిజ్య ఒప్పందంతో భారత్ నుంచి వస్త్రాలు, పాదరక్షలు, కొన్ని ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న సుంకాలు తగ్గనున్నాయి. దీంతో భారత ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో మరింత పోటీతత్వం పెరగనుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇరు దేశాల్లోనూ తక్షణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని బ్రిటన్ పేర్కొంది.
వివరాలు
టారిఫ్‌ల సరళీకరణతో వ్యాపారాలకు లాభం
ఈ ఒప్పందం కింద బ్రిటన్‌లోని 99 శాతం టారిఫ్‌లు, భారత్‌లోని 90 శాతం టారిఫ్‌లు సరళతరం కానున్నాయి. ఇంతటి విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఇప్పటివరకు అమలు చేయలేదని బ్రిటన్ తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ మార్కెట్లలో బ్రిటన్‌కు కూడా మరింత పోటీతత్వం పెరిగి, ఇతర దేశాలపై ఆధిక్యం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జులై 15 నుంచి కొత్త వాణిజ్య శకం.. భారత్-బ్రిటన్ ఒప్పందం అమల్లోకి
India-UK trade pact to take effect on July 15, PM Modi hails milestone
— IANS (@ians_india) June 17, 2026
· Prime Minister Narendra Modi on Wednesday announced that the India-UK Comprehensive Economic and Trade Agreement (CETA) will formally enter into force on 15 July 2026, marking what he described as a… pic.twitter.com/mhHaRK8uR6