LOADING...
Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్
చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్

Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన బీమా సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 11 రష్యా బీమా సంస్థలకు భారత్‌లో కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యంగా, ఈ సంస్థలు సముద్ర రవాణా బీమా అందించే ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ క్లబ్స్‌లో సభ్యత్వం లేకపోవడం గమనించదగ్గ అంశం. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇరాన్,అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద రాకపోకలు కఠినమయ్యాయి.

వివరాలు 

భారత్ రష్యాతో సహకారాన్ని మరింత బలపరచాలని నిర్ణయం 

దీంతో చమురు రవాణా నౌకలు ఆ మార్గంలో ప్రయాణించడం కష్టసాధ్యమైంది. మరోవైపు రష్యాకు చెందిన చమురు నౌకలు ఎక్కువగా ఎర్ర సముద్ర మార్గాన్ని ఉపయోగించి ఆసియా దేశాలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ రష్యాతో సహకారాన్ని మరింత బలపరచాలని నిర్ణయించింది. అనుమతులు పొందిన రష్యా బీమా సంస్థల్లో గ్యాస్‌ప్రోమ్ ఇన్స్యూరెన్స్, రోస్‌గోస్‌ట్రాక్, బ్యాలెన్స్, సోగ్లాసీ, ఉగోరియా గ్రూప్, స్బెర్‌బ్యాంక్, ఏఎస్‌టీకే వంటి సంస్థలు ఉన్నాయి.

వివరాలు 

రష్యాకు చెందిన నౌకలకు బీమా సేవలు అందించని 'ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఆఫ్‌ పీఅండ్‌ఐ క్లబ్స్‌'

ఇదిలా ఉండగా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆర్థిక శాఖ కూడా ఇటీవల అనుమతుల గడువును పొడిగించడం గమనార్హం. సముద్ర రవాణా రంగంలో ఐరోపా కేంద్రంగా పనిచేసే 'ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఆఫ్‌ పీఅండ్‌ఐ క్లబ్స్‌' కీలక పాత్ర పోషిస్తుంది. థర్డ్‌పార్టీ నష్టాలు, కాలుష్యం, సరుకు నష్టం వంటి అంశాలకు బీమా రక్షణ కల్పిస్తూ ప్రపంచ సముద్ర రవాణాలో సుమారు 87 శాతం వాటాను కలిగి ఉంది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ సమాఖ్య రష్యాకు చెందిన నౌకలకు బీమా సేవలు అందించడం లేదు.

Advertisement