
Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. కొనుగోళ్లు ఆపకపోతే..
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు దిగుమతుల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే, భారత ఎగుమతులపై "భారీ సుంకాలు" విధించే పరిస్థితి వస్తుందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఇప్పటికే మాట్లాడినట్లు,భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్,"భారత ప్రధాని మోదీతో నా మధ్య చర్చ జరిగింది. ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరని నన్ను నమ్మించారు" అని చెప్పారు. అయితే, గత వారం ఇదే వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కఠినంగా స్పందించింది.
వివరాలు
రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై ఒత్తిడి
ఆ రోజున ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి విలేకరులు అడగగా, ట్రంప్ "వారు అలా చెప్పాలనుకుంటే చెప్పుకోనివ్వండి. కానీ, అప్పుడు వారు భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయడానికి వారు ఇష్టపడరు" అంటూ ట్రంప్ పరోక్షంగా బెదిరింపు ధోరణిలో సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మధ్య రష్యా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంధన వ్యాపారాన్ని దెబ్బతీయాలని అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా తక్కువ ధరలకు చమురును విక్రయిస్తోంది.
వివరాలు
రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాల కారణంగా అదనంగా 25 శాతం జరిమానా
ఈ పరిస్థితిని ఉపయోగించుకొని రష్యా చమురును సముద్ర మార్గం ద్వారా అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. తమ దేశ వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వం మొదటి నుంచే స్పష్టం చేస్తోంది. ఇప్పటికే అమెరికా, భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాల కారణంగా అదనంగా 25 శాతం జరిమానా కూడా అమల్లో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగితే ఈ సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.
వివరాలు
భారత్ కొనుగోళ్లు తగ్గాయంటున్న వైట్‌హౌస్.. వాస్తవాలు వేరు
ఇక వైట్‌హౌస్ వర్గాల ప్రకారం, భారత్ ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సగానికి తగ్గించిందని ఒక అధికారి తెలిపారు. అయితే, భారత వర్గాలు ఈ వాదనను ఖండించాయి. నవంబర్, డిసెంబర్ నెలల ఆర్డర్లు ముందుగానే ఖరారయ్యాయని, అందువల్ల వెంటనే దిగుమతుల్లో తగ్గుదల ఉండదని వివరించాయి. అంతర్జాతీయ కమోడిటీస్ డేటా సంస్థ 'కెప్లర్' అంచనాల ప్రకారం,ఈ నెలలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు సుమారు 20 శాతం పెరిగి, రోజుకు 1.9 మిలియన్ బ్యారెల్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది.