LOADING...
Drone Boat: ఇరాన్ దాడిలో చిక్కుకున్న అమెరికా పైలట్లకు ప్రాణదాతగా నిలిచిన డ్రోన్ బోట్.. తయారీలో భారతీయుడి పాత్ర
తయారీలో భారతీయుడి పాత్ర

Drone Boat: ఇరాన్ దాడిలో చిక్కుకున్న అమెరికా పైలట్లకు ప్రాణదాతగా నిలిచిన డ్రోన్ బోట్.. తయారీలో భారతీయుడి పాత్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ దాడిలో ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను మానవ రహిత డ్రోన్ బోట్ సురక్షితంగా రక్షించి చరిత్ర సృష్టించింది. అమెరికా తొలిసారిగా చేపట్టిన ఈ ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో అక్కడి రక్షణ వ్యవస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ అత్యాధునిక సీ డ్రోన్‌ను భారతీయ అమెరికన్ వైభవ్ ఆల్టేకర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెక్సాస్‌కు చెందిన సరోనిక్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించడం విశేషం.

వివరాలు 

అసలేం జరిగింది..

అమెరికాకు చెందిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో సాధారణ ప్యాట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇరాన్ దాడి చేసింది. దీంతో హెలికాప్టర్ ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో కూలిపోయింది. అయితే అందులోని ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడి సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా నౌకాదళ టాస్క్ ఫోర్స్-59 వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టెక్సాస్‌కు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ సరోనిక్ టెక్నాలజీస్ తయారు చేసిన కోర్స్‌ఎయిర్ అటానమస్ డ్రోన్ బోట్‌ను రంగంలోకి దించింది. ఈ మానవ రహిత పడవ సముద్రంలో ఉన్న పైలట్లను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మరో సురక్షిత ప్రాంతానికి తరలించింది.

వివరాలు 

మనోడి భాగస్వామ్యం

టెక్సాస్‌లోని ఆస్టిన్ కేంద్రంగా 2022లో సరోనిక్ టెక్నాలజీస్ సంస్థను నలుగురు భాగస్వాములు స్థాపించారు. వారిలో భారతీయ అమెరికన్ వైభవ్ ఆల్టేకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వైభవ్ ఆల్టేకర్, ఆటానమస్ సిస్టమ్స్, సముద్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం సంపాదించారు. ఆయన సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేసిన వ్యవస్థ ఇప్పుడు అమెరికా రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement

వివరాలు 

కోర్స్‌ఎయిర్ డ్రోన్ బోట్ ప్రత్యేకతలు

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సంప్రదాయ సైనిక బలగాలకు తోడుగా స్వయంచాలక, మానవ రహిత వ్యవస్థలను విస్తృతంగా వినియోగించాలనే వ్యూహానికి కోర్స్‌ఎయిర్ డ్రోన్ బోట్ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. కోర్స్‌ఎయిర్ డ్రోన్ బోట్ పొడవు 24 అడుగులు. డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగి ఉండటంతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో అమెరికా వేల సంఖ్యలో డ్రోన్ బోట్లను మోహరించింది. ప్రస్తుతం వీటిని సముద్ర నిఘా, మందుపాతరల గుర్తింపు, శత్రు కదలికలపై నిఘా పెట్టడం వంటి పనుల్లో వినియోగిస్తున్నారు. కొన్ని డ్రోన్ బోట్లను నేరుగా యుద్ధ కార్యకలాపాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.

Advertisement