LOADING...
USA: అమెరికాలో భారతీయులు రాజకీయాల్లోకి రావాలి: కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపు
అమెరికాలో భారతీయులు రాజకీయాల్లోకి రావాలి: కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపు

USA: అమెరికాలో భారతీయులు రాజకీయాల్లోకి రావాలి: కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న ప్రజలు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి(Raja Krishnamoorthi)పిలుపునిచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారత్‌, హిందువులపై విద్వేషపూరిత ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. జాతి వివక్షకు సంబంధించిన ఘటనలకు వ్యతిరేకంగా తమ స్వరం బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని, ప్రజా జీవితంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని భారతీయ-అమెరికన్లను కోరారు. 'ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్‌' (FIIDS) ఆధ్వర్యంలో క్యాపిటల్ హిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజా కృష్ణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అత్యంత విద్యావంతులు, ఆర్థికంగా బలమైన వర్గాల్లో భారతీయ-అమెరికన్లు ఒకరిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రవాస భారతీయులు ఐక్యంగా నిలవాలి 

అమెరికా సమాజంలో భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక భావజాలం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల భారతీయ మూలాలున్న ప్రజలకు పలు సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని రాజకీయ పదవులకు పోటీ చేయాలని ప్రోత్సహించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తకపోతే బాధితులుగానే మిగిలిపోవాల్సి వస్తుందని రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములై తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరో కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ కూడా మాట్లాడారు. అమెరికాలో వలసదారులపై ద్వేషపూరిత ధోరణులు పెరుగుతున్నాయని పేర్కొన్న ఆయన, అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రవాస భారతీయులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement