
Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేసినట్టు భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు కీలక శిబిరాలు నేలమట్టమయ్యాయి.
ప్రత్యేకంగా బహావల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలోని ప్రధాన హెడ్‌క్వార్టర్‌ను లక్ష్యంగా చేసుకుంది ఇండియన్ ఆర్మీ. ఈ కేంద్రం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది.
గతంలో 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్టు గుర్తించారు.
Details
30 ఉగ్రవాదులను మృతి
మసూద్ అజార్ ఆధ్వర్యంలోని ఈ టెర్రర్ క్యాంప్ భారత సైన్యం టార్గెట్ చేయగా, భారీగా విరుచుకుపడింది.
ఈ నేపథ్యంలో మసూద్ అజార్ ఉన్న ప్రాంతాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని భారత్ మిస్సైల్ దాడులు జరిపింది.
బహావల్పూర్‌లోని శిబిరంపై మొదట దాడి చేసి, 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. అంతేకాకుండా లష్కరే తోయిబా శిబిరాలపైనా భారత్ మిస్సైల్ దాడులు చేసింది.
మొత్తం ఆరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో భారత్ 24 క్షిపణులను ప్రయోగించినట్టు పాకిస్తాన్ ఆరోపించింది.
ఇక, మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరాల నుంచే ఉగ్ర కార్యకలాపాలను నడిపిస్తున్నట్టూ భారత రక్షణ శాఖ అభిప్రాయపడింది.